కారు డ్రైవర్ల కధ -2

Saturday, March 28, 2009

(గతటపా తరువాయి )

కారన్నాక ఆగదా? అన్నట్టు చూస్తున్నాడు యాదయ్య నావైపు.

వింతగా, జాలిగా, కోపంగా పళ్ళు పటపట లాడిస్తూ,ఇలా ప్రపంచంలో ఉన్న అన్నిరకాల భావాల్నీ మొహంలో ప్రతిఫలిస్తూ నా కారు రెండువైపుల నుంచీ వాహనాల్ని దూకిస్తున్నారు నగరవాసులు.

టీ తాగటం వరకూ శాంతంగా ఉన్న ట్రాఫిక్ పోలీసు కొద్దిగా కోపాన్ని పులుముకొని నా కారు దగ్గరికొచ్చి కార్లో ఉన్న నన్నూ, యాదయ్యనీ మార్చి మార్చి చూసి, ఇందాకటి కోపం, ఇంతలోనే వచ్చిన ఆసక్తి, అయోమయం మూడిటినీ కలిపి ఒక వింతైన మొహం పెట్టి అడిగాడు.

"పెట్రోలయిపోయిందా?"

లేదు. "L" బోర్డు పెట్టనందుకు నన్ను నేను తిట్టుకొంటూ చెప్పాను.

"బ్యాటరీ డౌనా?

"లేదు, మొన్నే కారు సర్వీసింగుకిచ్చా, క్లచ్ బాగా టైటు చేసినట్టున్నాడు మెకానిక్" ఈ మాట చెప్తూనే యాదయ్య వైపు చూసా ఇకనైనా కరుణించు మహాశయా అన్నట్టు.

"అరె అంత భయపడితే ఎలా సార్, అంటూ వెనకాల వస్తున్న వాహనదార్లకి కాస్త దూరంగా పొండి అన్నట్లు చెయ్యి చూపిస్తూ విసుగ్గా డోరు తీసి కారుదిగాడు యాదయ్య.

"బతుకు జీవుడా అంటూ నేనుకూడా "ఎక్స్ క్యూజ్మీ" అంటూ ఆ పోలీసుని పక్కకి జరగమని చెప్పి, కారుదిగి వెనక డోరు తెరచి ఠక్కున ఆ సీట్లో కూలబడ్డా ను.

ఆ పోలీసు చూస్తుండగానే కారు ముందుకి కదిలింది. వెనక సీట్లో అలాగే జారిగిలబడి "యాదయ్యా స్టీరియో ఆన్ జై" అన్నా తలపట్టుకొని.

నేనెంతో ఏరికోరి సీడీ లో కూర్చిన పాటల్లోంచి ఈ "దేవత" పాట వినిపిస్తోంది

కుడి కన్ను కొట్టగానే కుర్రోణ్ణి, ఎడంకన్ను కొట్టగానే ఎర్రోణ్ణి,
కుడి కన్ను కొట్టగానే కుర్రోణ్ణి, ఎడంకన్ను కొట్టగానే ఎర్రోణ్ణి,
ఆ రెండుకళ్ళు కొట్టరాదా, నన్ను రెచ్చగొట్టిచూడరాదా..
"వంకాయ్"
హొయ్ హొయ్
*****************************************************************
ఆ తరువాత కరెక్టుగా రెణ్ణెళ్ళకి సహనం కోల్పోయిన యాదయ్య, నాకూ, నా కారుకీ గుడ్ బై చెప్పేసి టీ బండి తెరిచేసాడు. ఇప్పటికీ నేను మా అపార్టుమెంటు లోంచి బయటికి వచ్చేటప్పుడు నన్ను గమనించినా గమనించనట్టు ఉండటానికి శతధా ప్రయత్నిస్తాడు యాదయ్య. కస్టమర్లెవరూ లేకున్నా సీరియస్ గా టీ కలపడమో, అప్పుడే గుర్తొచ్చినట్టు ఆ వాడిన టీపొడిని పారేయటానికి పక్కకెళ్ళడమో చేయటం ద్వారా.

ఆ తరువాత ఒక రెణ్ణెళ్ళు నేనే కష్టపడ్డాను. పొద్దున్నే ఏడింటికే ఆఫీసుకెళ్ళడం, రాత్రి పది తరువాతే బయటికిరావడం. అప్పుడప్పుడు, నా కొలీగ్స్ ఎవరైనా ఆఫీసు వదిలి ఇల్లుజేరాక, ఏదైనా గుర్తొచ్చి ఇంకా ఆఫీసులోనే ఉన్న నాకు ఫోన్ చేస్తే నేను వీలైనంత క్యాజువల్ గా అడిగే ప్రశ్నొకటుంది.

"ఈరోజు ట్రాఫిక్ ఎలా ఉందేమిటీ?"

************************************************************

ఒకానొక శనివారం.

అప్పటికప్పుడు యాదగిరి గుట్ట వెళ్దామని నిర్ణయించుకొని డ్రైవర్ కోసం రోడ్డున పడ్డాడు మా అన్నయ్య. మా ఇంటిపక్కనే టాటా సుమోలూ, క్వాలిస్ లు అద్దెకిచ్చే ఏదో ట్రావెల్స్ ఆఫీసుంది. అక్కడికి పొద్దున్నే ఒక పదిమంది డ్రయివర్లు చేరుకొని మా లాంటి కస్టమర్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలా మాకు దొరికాడొక డ్రయివర్. పేరు రమేష్. రెండంగుళాల ఎర్రని నిలువు కుంకుమ బొట్టుపెట్టుకొని మహా భయానకంగా కనపడతాడు.ప్రయాణంలో ఆయనతోటి మాటలు కలవడం, ఆయన నా డ్రయివింగు కష్టాలు విని , జాలిపడి ,వాళ్ళ బావ భిక్షపతి ని ఆ సోమవారం పొద్దున్నే మా యింటికి పంపాడు.

టీవీలో చినజీయరు స్వామి ప్రవచనాలు వింటున్న టైములో డోరు బెల్లు మోగింది. తలుపు తీసా.

ఎదురుగా మాసిన గడ్డంతో ఒక ఐదడుగుల ఎత్తున్న వ్యక్తి,సన్నగా పీలగా లూజు పేంటూ, లూజు షర్టూ వేసుకొని.

"నమస్తే సార్. రమేష్ పంపించాడు సార్, డ్రయివర్ గావాలన్నార్ట?"

" ఓ, సరే లోపలికి రా.కూర్చో, ఏంటి నీపేరు?

"భిక్షపతి సార్."

ఎవరో చెప్పారు, పనిమనిషి, డ్రయివర్, వీళ్ళిద్దరినీ పనిలో కుదుర్చుకునే ముందు వాళ్ళెవరు? ఎక్కడుంటారు? వాళ్ళకి ఎంతమంది పిల్లలు? వాళ్లు ఏ స్కూల్లో చదువుతున్నారు? ఏ తరగతి? ఏమీడియం? ఏ సెక్షను? వాళ్ల రోల్ నంబరు ఏమిటి? అసలు వీళ్ళది మొదట్నుంచి హైదరాబాదేనా, లేక హైదరాబాదు చుట్టుపక్కల ఏదైనా ఊరా? ఇత్యాదివన్నీ అడగాలట మన సెక్యూరిటీ కోసం. వాళ్ల వివరాలన్నీ మనకి తెలిస్తే ముందు ముందు పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి వారు భయపడతారు అనేది దీని వెనకున్న మాగొప్ప కారణం.

నేనయితే అవేమీ అడగలేదుగాని, ఒకే ఒక ప్రశ్న వేసా.

"ఎన్నేళ్ళ ఎక్స్ పిరియన్స్ ఉందేంటి?

మొహంలో గౌరవం ఏమాత్రం తగ్గకుండా,గొంతులో మాత్రం కొద్దిపాటి నిర్లక్ష్యాన్ని ఒలికిస్తూ అన్నాడు..

"ఇప్పటి సందా సార్,ఇరవై ఏళ్ళ పైనే.లారీ, మినివేన్, ఏ బండైనా నడుపుతా సార్".

అడక్కుండా ఈ మాట కూడా అన్నాడు, "ఈ రమేష్, ఇంకా చాలామందికి డ్రయివింగు నేనే నేర్పినా సార్"

"సరే, లారీలు, వేన్లు వద్దులేగాని, మారుతి వేగనార్ నడపగలవా?"

"ఎంత మాట సార్"

రమేష్ ఏమి చెప్పి పంపాడో గాని, జీతం దగ్గర ఏమాత్రం తగ్గలేదు భిక్షపతి .నాకింత కావాలి అంతే. ఇది నా ఎన్నారై స్టేటస్ నామీద పన్నిన కుట్ర అని వెంటనే నాకర్ధమయింది. నాప్రతి విజిట్లో నేను హైదరాబాదు ఎయిర్ పోర్ట్లో దిగినప్పటినుంచి తిరుగు ప్రయాణ మయ్యేవరకూ ఈ కుట్ర నామీద చాలా విజయవంతం గా అమలుచేయబడుతోంది.

నేనుకూడా కాసేపు ఇలా అయితే ఎలా అన్నట్టు మొహం పెట్టి, చివరికి కొన్ని షరతులు పెట్టి, ఒప్పేసుకున్నా. అవేమిటంటే, అవసరమైనప్పుడు ప్రతిఫలాపేక్ష లేకుండా ఓవర్ టైం చెయ్యటం, అప్పుడప్పుడు ఆదివారాలు కూడా పనిచెయ్యటం లాంటివి. జీతం ఆకర్షణీయంగా ఉండటంతో వెంటనే తలూపాడు భిక్షపతి.

ఆరోజు పనేమీ లేక పోవటంతో "రేపట్నించి రా" అని చెప్పి పంపించేసాను.

మరుసటిరోజు పొద్దున్నే ఠంచనుగా ఎనిమిదింటికి తలుపు తట్టాడు భిక్షపతి. తాళాలివ్వగానే తీసుకొని కిందకెళ్ళిపోయాడు . మాములుగా యాదయ్యకి తాళాలివ్వగానే కారు అపార్ట్మెంటు బయటికి తీసుకొచ్చి పార్కు చేసి కింద వాచ్మెన్ పిల్లలతో ఆడుకోవడమో లేదా పక్కనే కడుతున్న వేరే అపార్ట్మెంటుపనోళ్ళతో బాతాఖానీ కొట్టడమో చేస్తాడు. అదే అలవాటు మీద నేను కిందకొచ్చి చూస్తే కారు లేదు. పక్కనే ఆడుకుంటున్న వాచ్మెన్ పిల్లల్ని అడిగితే "తెలీందంకుల్" అన్నారు. ఒకరెండునిముషాలు చూసి ఏదో డౌట్ వచ్చి సెల్లార్లోకొచ్చి చూస్తే కారక్కడే ఉంది. కాస్త దగ్గరికెళ్ళి చూస్తే కార్లో భిక్షపతి సీట్ వెనక్కి వాల్చిఅర్ధశయనాసనంలో , FM రేడియో లో ఏదో పాట వింటూ చేత్తో తాళం వేస్తూ నోటితో హమ్ చేస్తున్నాడు.నేను కిటికీ దగ్గరికెళ్ళి అద్దమ్మీద నెమ్మదిగా కొట్టా..వినపడినట్టులేదు. ఈసారి ఇంకాస్త గట్టిగా..ఊహు..లాభం లేదు. అద్దమైతే పగులుతుందని కారు డోరు మీద గట్టిగా కొట్టా.. తన ఊహాలోకం లోంచిబయటికొచ్చి నన్ను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. ఎంతగా ఉలిక్కి పడ్డాడంటే ఆయన ఉలికిపాటు చూసి నేనూ ఉలిక్కిపడ్డా. నేను తమాయించుకోనేలోపు పనిలో పనిగా ఒక నమస్కారం కూడా పడేసాడు.

అద్దం దించమని సైగ చేసి, దించాక అడిగా.

"బండి బయటికి తీయొచ్చుగా?"

"ఒకటే ఎండ సార్, అలా అవసరం లేకుండా ఎండలో పెడితే బండి రంగు తేలుద్ది."

ఆహా బానే సమర్ధించుకుంటూన్నాడే అనుకున్నా.

నేను కార్లో కూర్చోగానే అడిగాడు.

"ఎక్కడికెళ్దాం సార్"

"ప్యారడైజ్ పోనీ"

మొట్టమొదటిసారి కాబట్టి భిక్షపతి తన కళనంతా చూపిస్తున్నాడు.చకచకా గేర్లు మార్చడం, రోడ్డు మీద ఒక ఇరవైఅడుగుల దూరం ఖాళీ దొరగ్గానే కారుని ముందుకురికించడం, మళ్ళా వెంటనే బ్రేక్, అలా తన ఇరవై ఏళ్ళ అనుభవాన్ని నాకు చూపిస్తున్నాడు. నేనడిగాను

"నువ్వుండేదెక్కడ భిక్షపతీ?"

రోడ్డునీ
, రియర్వ్యూ అద్దంలో నన్నూ మార్చి మార్చి చూస్తూ చెప్పాడు.
"నేనా సార్, మన అపార్ట్మెంటు నుంచి ఒక ఆఫ్ కిలోమీటర్ లోపటికెళితే ఒక బస్తీ ఉంటది సార్. ఆ బస్తీల ఉంటా సార్"

ఏది ఆ ..... బస్తీ యా?

"అవున్సార్"

ఆ బస్తీ అంటే ఆ వీధిలో అందరికి హడల్. సీయం కాన్వాయ్ అయినా అక్కడికొచ్చిందంటే స్లో గా పోవాల్సిందే. మొన్నొకసారి ఒక అభాగ్యుడు,ఆ బస్తీ గురించి తెలీనోడు, తన ద్విచక్ర వాహనం పై వస్తూ, రోడ్డుకి అడ్డంగా హఠాత్తుగా పరిగెత్తుకొచ్చిన ఒక బస్తీ పిల్లోడి బుగ్గకి కి పొరపాటున బైకు హేండిల్ తగిలించటం, ఫలితంగా వాడి బుగ్గ కందటం, ఆ పిల్లోడేసిన కేకలకి బస్తీ అంతా కదలి రావటం, వాడి జేబులో ఉన్న మూడువేలు లాక్కోటమే కాకుండా, "పోలిసుల్ని పిలుద్దాం" అని ఆవేశంలో వాడు అజ్ఞానిలా మాట్లాడే సరికి కింద పడేసి చితక తన్నడం కూడా చేసారు.

మా వీధిలో ప్రతి రెండొందల అడుగులకి ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కట్టిన పెద్దల్ రెడ్డి కూడా ఆ బస్తీ మీద కన్నేసి, వీరి కారణంగా ఆ చుట్టుపక్కల తను కట్టిన అపార్ట్మెంటులకి రేటు పలకటం లేదని, దాన్ని కబ్జా చేద్దామని ట్రై చేసి, ప్రతిఫలంగా అదే వీధిలో ఉన్న తన సొంతిల్లు వదిలిపెట్టి ఒక రెండు వీధులవతల అద్దింటికి తన మకాం మార్చాల్సొచ్చింది.

ఏదో ఒకటి మాట్లాడాలికదా అని అడిగా.

"డ్రయివింగేనా లేకపోతె ఇంకేమయినా చేస్తుంటావా?" ఇది అడగటానికి కారణమేమిటంటే ఒక రెండురోజుల ముందు రమేష్ తనబావ ఊరికే పని పాటా లేకుండా తిరుగుతుంటాడని చెప్పడం.

"నేను కాంగ్రెస్ పార్టీల పనిజేస్త సార్"

"ఓ, నీ బామ్మర్ది బీజేపీ కదా, నువ్వేమో కాంగ్రెస్సా?"

"నేను మొదట్ల బిజెపిల ఉన్నా సార్, అదొక వేస్టు పార్టీ సార్"

"ఎందుకు వేస్టు ?"

"అదంతే సార్, ఇప్పుడు కాంగ్రెస్ల ఉన్నా, మంచిగుంది"

"ఎలా?"

"ఎలా అంటే ఏమున్నది సార్, చేతినిండా పని, పైగా కాస్త పైసలు గూడ మిగుల్తాయి సార్"

"ఇంతకీ ఎవరేమిటి నీ లీడరు?"

పేరు చెప్పాడు.

పేపర్లలో చదవటమే గాని, ఇలాంటీ "క్రియాశీలక కార్యకర్త"లని నేనిదే ప్రత్యక్షంగా చూడటం. ఏదైనా ధర్నా ఉన్నా, లేదా ఢిల్లీ నుంచి ఏదైనా పెద్ద తలకాయ ఇక్కడికి వస్తున్నా, లేదా ఇక్కడున్న చిన్న తలకాయలు ఢిల్లీ వెళ్తున్నా, కారణమేదైనా కానివ్వండి, ఆ అన్నకి తన బలం-బలగం చూపించాల్సి వస్తే, మొదట మా వీధిలో ఉన్న ఒక ఛోటా నాయకుడికి ఫోనోస్తుంది. అక్కడి నుంచి బిక్షపతి లాంటి వాళ్ళకి. భిక్షపతి చేసేదల్లా ఒక ముప్పై నలభై మందిని పోగేసుకొని అక్కడికెళ్ళి ఆ బుర్ర లేని తలకాయలముందు "అన్న కీ జై జై" అనడం. అలా అన్నందుకు అందరికీ బిరియానీలూ, మనిషికింతని క్యాషూ, అందులో కొంత తనుంచుకొని మిగతాది భిక్షపతి తను పోగేసుకోచ్చిన వాళ్ళకి పంచుతాడు.

మనమెవ్వరం వినని రాజకీయాలు మూడో డైమెన్షన్లో వినపడేవి నాకు భిక్షపతి ద్వారా.

ఆయన డ్రయివర్ కం పార్టీ కార్యకర్త అయ్యేసరికి నాకు కూడా లెక్కలేనన్ని సమస్యలు వచ్చిపడ్డాయి. ముందు రోజు సాయంత్రం హఠాత్తుగా డిక్లేర్ చేస్తాడు "సార్ రేపు రాను" అని.

"ఎందుకు?"

" సీయం రేపు ఢిల్లీ వెళ్తున్నాడు, పొద్దునే షంషా బాద్ వెళ్ళాల"

"మరి నా పన్లూ?"

"అర్జెంటా సార్?"

" "

"అర్జెంటంటే చెప్పండి సార్, నాకు తెలిసినోడొకడున్నాడు వాణ్ణిపంపిస్తా"

కాదనలేకపోయేవాడిని.పక్కనుంచి మా శ్రీమతి గొణుగుడు మీఇద్దరిలో ఎవరికెవరు యజమాని అని.

ఇంకోరోజు డ్రయివింగు చేస్తూనే, ఏదో గుర్తొచ్చి, ఉన్నట్టుండి గట్టిగా అరిచాడు

"సార్ మీరీరోజు టీవీల న్యూస్ జూసిండ్రా?"

"లేదే? ఏం?"

"నేపడ్డ సార్ టీవీల"

"ఎక్కడ?"

"నిన్న మా అన్న సీయం ఢిల్లీ కెళ్ళొస్తుంటే రిసీవ్ చేస్కోని ఏర్పోర్ట్ కెళ్ళిండు, అక్కడ, అన్న పక్కనే నేనున్న, జూడ్లే?"

ఆ రోజు సాయంత్రం పనిగట్టుకొని అన్నిఛానల్స్ వెతికితే ఒకచోట దొరికాడు. అన్న ఆవేశంగా మాట్లాడుతుంటే పక్కనే నిలబడి ఉన్నాడు తమ్ముడు. అది కాదు నన్నాకర్షించింది. టీవీలో పడుతున్నాననే ఆలోచనో, అన్న పక్కనున్నాడనో లేక మరేమిటో గానీ మొహంలో భావాలేమీ లేకుండా బిర్రబిగుసుకొని కర్రలా నిలబడ్డాడు భిక్షపతి. ఇన్నిరోజులుగా తనని చూస్తున్నా నాకుమాత్రం ఆ టీవీలో చాలా విచిత్రంగా కనపడ్డాడు. అంత సీరియస్ నెస్ నేనెప్పుడూ చూడలేదు ఆయన మొహంలో. చివర్లో మాత్రం వెనక నిలబడ్డవారివైపు ( తను తరలించుకొచ్చిన మనుషులు అనుకుంటా) చూస్తూ , గుప్పిట బిగించి, చేయి పైకెత్తి ,పూనకం వచ్చినవాడిలా "అన్నజిందాబాద్" అన్నాడంతే.

ఇంకొక రోజు కాంగిరేసు పార్టీలో ఉన్న అసమ్మతి గురించిన టాపిక్ వచ్చింది మా మధ్య.

"ఇంతలా వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటే మళ్ళీ ఎలక్షన్లలో గెలవద్దా?" అడిగాను నేను..

నా ప్రశ్నకి సమాధానం చెప్పకుండానే ఏదో గుర్తొచ్చినట్టు అడిగాడు.

"సార్ మీకాయన తెలుసా, అబ్బ, ఆయన పేరు గుర్తుకురావటంలేదు సార్, చేగోడీలు, ఆహా కాదు...."

"చేగోడీలా, ఆపేరుతొ ఎవరున్నారబ్బా, చేగొడీలో కారబ్బూందో నాకుతెలీదు అయినా ఏమిటివిషయం?"

"ఆయన పేరు, అబ్బా, చేగొడీ, హరేరాం, హరిఓం.. ఏదో ఉంది సార్..."

"సరే, విషయం చెప్పు"

"మొన్న మేము ఆ పెద్దాయన ఇంటికి మీదకెళ్ళి రాళ్ళేసినం, పేపర్లో వచ్చింది కూడా"

నాగ్గుర్తోచ్చేసింది ఎవరి గురించి మాట్లాడుతున్నాడో..

"ఏంటీ ఆ రాళ్ళేసింది మీరేనా?నేం కూడా చదివా పేపర్లో"

"అవున్సార్, మేమే, అన్న జెప్పిండు, ఏసేసినాం"

"ఏంటీ కనీసం పేరు కూడా తెలుసుకోకుండా, అసలు విషయమేంటో తెలుసుకోకుండా వెళ్ళి రాళ్ళేసేసావా?"

"పేర్లు మనకెందుకుసార్?"

జాలి, బాధ, కోపం కలగలసిన భావమేదో నాక్కలిగిందా క్షణాన. అదెవరిమీదో కూడా తెలీదు.

పొద్దున్నే ఠంచనుగా ఎనిమిదింటికి వచ్చే భిక్షపతి ఆరోజు రాలేదు. ఫోన్ చేసినా తీయటం లేదు. నాకేమో కోపం వస్తోంది. దాదాపు పది గంటలప్పుడనుకుంటా ఎవరో వచ్చి చెప్పాడు..

"డ్రయివర్ గావాల్నా సార్, భిక్షపతి పంపాడు"

"ఆయనకేమయింది?" కోపంగా అడిగాను.

తెలీదు సార్, ఏదో అర్జెంట్ పనిమీద ఊర్ల కెళ్ళాడు.."

కనీసం ఎవర్నో ఒకర్ని పంపాడు కదా అని తాళాలిచ్చి చెప్పా.

"సరే బండి బయటికి తియ్"

భిక్షపతితో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండే నాకు ఆరోజు మహా బోరు గా అనిపించింది.

"రేపొస్తాడా భిక్షపతి?" అడిగాను.

"ఏమో తెలిదు సార్, కనుక్కోని చెప్తా"

మళ్ళా తనే అడిగాడు.

"రాత్రి ఎన్నింటిదాకా ఉన్నాడు సార్ భిక్షపతి మీతో?"

"దాదాపు తొమ్మిదింటికి కారు లోపల పెట్టాడు, ఏం?"

"ఏం లేదు సార్ ఊరికినే". నాకెందుకో ఏదో జరిగి ఉంటుందనే అనుమానం బలపడింది.

ఆ మరుసటి రోజు మధ్యాహ్నం డోరు బెల్లు మోగింది..

తలుపుతీస్తే భిక్షపతి. మొహం పీక్కు పోయినట్టు గా ఉండి, మనిషి నీరసంగా కనపడుతున్నాడు. లోపలికి రమ్మని, కాఫీ ఇచ్చి కాసేపు మాట్లాడి, నీరసంగా ఉన్నట్టున్నావ్, ఏమయింది అని అడిగితే "జ్వరం సార్" అన్నాడు.ఈరోజుకి వద్దులే రేపు మాత్రం కరెక్టుగా ఎనిమిదింటికల్లా రా అని చెప్పి అని చెప్పి పంపించేసాను,

ఆ మరుసటి రోజు నేను నా శ్రీమతి షాపింగుకి బయలుదేరాం. దార్లో అడిగా ఏమయింది నిజంగా చెప్పు జ్వరమేనా ఇంకేమన్నానా అని.

కాస్త తటపటాయించి చెప్పాడు..

"ఆ రోజు రాత్రి మన స్ట్రీట్ల పెద్ద గొడవయింది సార్. ఆ రాత్రీ, పొద్దుగాల పదింటివరకూ టేసన్ల ఉన్న.అన్న ఫోన్ జేసి ఇడిపిచ్చిండు "

నాకు వెంటనే గుర్తొచ్చింది ఒక మూడ్రోజుల క్రితం అపార్ట్మెంటు కింద తొమ్మిదీ తొమ్మిదిన్నర మధ్య మెయిన్రోడ్డు దగ్గర ఏవేవో పెద్ద అరుపులూ, కేకలూ.బాల్కనీ లో కొచ్చి చూసా కూడా ఏమయినా కనపడుతుందేమో నని.

"ఏమయింది?"

"ఎవరో పోరగాళ్ళు మీదికొచ్చారు సార్"

ఎవరు వాళ్ళు?"

మా బస్తీల్నే ఉంటారు సార్, మొన్నీ మధ్య వచ్చినోళ్ళు, నాతో పెట్టుకుంటారా, బచ్చాగాళ్ళు"


"ఇంతకీ ఏమయింది?"

"ఒకడికి తల పగల్గొట్టినా, ఇరవై కుట్లు పడ్డాయంట, ఇంకొకనికి కాలిరిచేసినా "

పేపరు చదువుతూ అప్పుడప్పుడు రోడ్డుమీద ట్రాఫిక్కు ని వింతగా చూస్తున్న నా శ్రీమతి కూడా పేపరు మూసేసి మా సంభాషణని వింటోంది భయ భయం గా..

నాకేమో ఆ డ్రయివింగు సీట్లో ఉన్న భిక్షపతి భిక్షపతి లా కనిపించటం లేదు, ఎవరో అపరిచిత వ్యక్తి లా కనపడుతున్నాడు

నేనడిగా, "అసలెందుకయింది గొడవ?"

"ఏదో మా బస్తీ పార్టీ గొడవలు లెండి సారు"

మళ్ళాతనే చెప్పాడు.

"ఒక నెల సందు ట్రై చేస్తున్నారంట సార్ నా కోసం ఆ పోరగాళ్ళు, చాకులు పట్టుకొని"

నాశ్రీమతీ నేనూ మొహలు చూసుకున్నాం. అభిప్రాయాలు కలవటం మాటేమో గాని, భయాలు మాత్రం మాబాగా కలుస్తాయి మాకు.

భిక్షపతి తనెప్పుడూ నమిలే ఏదొ వక్కపొడి కోసం పక్కకెళ్ళ గానే మావిడ చెప్పేసింది సీరియస్ గా,

"అదృష్టం కొద్దీ మనతో ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళబడలేదు భిక్షపతి, అదేగనక జరిగితే ఆయనా, ఆయనతో పాటు మనమూ.." అంటూ ఆపేసింది.

అప్పుడర్ధమయింది నాకు, నేనెప్పుడు భిక్షపతి ని కలవడానికెళ్ళినా అతని పక్కన కనీసం నలుగురైదుగురుంటారు, బావలో బామ్మర్దులో ఇంకెవరో. ఇందుకేనన్నమాట.

అప్పటికప్పుడే ఆ రెండు నిమిషాల్లోనే తను డిసైడ్ చేసేసింది రేపట్నించి అంతగానయితే ఆటోల్లో తిరుగుదాంగాని భిక్షపతి మాత్రం వద్దు అని.

భిక్షపతి తిరిగి సీట్లో కూర్చున్నా నాకేమీ మాట్లాడాలనిపించలేదు. మావిడ ఆయనతో ఏదో కబుర్లు చెప్తోంది గానీ, నా మనసులో ఎన్నో ఆలోచనలు భిక్షపతి గురించి. తనకి ఇద్దరు పిల్లలు. వీళ్ళ స్కూలు ఖర్చులకే చెప్పలేనంత ఖర్చవుతుందని మొత్తుకునేవాడు భిక్షపతి. అగ్గిపెట్టెలాంటి ఇంట్లో నివాసం. ఈ రాజకీయాలూ, గొడవలూ ఇవన్నీ ఎందుకూ అని ఎవరైనా అనొచ్చు. కారణమేదైనా, వ్యవస్థే తప్పుదారి పడుతున్నప్పుడు దానిలోని ఇలాంటి బడుగు జీవుల్ని వేరుచేసి తీర్పిచ్చేస్తే ఎలా? అనిపించింది.

ఎవరు చెప్పొచ్చారు, రేపు భిక్షపతి వార్డు కౌన్సిలర్ కావచ్చు, అలా అలా ఇంకో పదేళ్ళకి ఎమ్మెల్యే కావచ్చు, తనలాంటి కొందరు తమ్ముళ్ళకి అన్నా కావచ్చు.

మొన్నొకసారి ఫోన్ చేస్తే చెప్పాడు "నాకేం సార్, మంచి గున్న, మీరిండియా రానీకి ఒక రెండ్రోజులముందు నాకు జెప్తే..,నే.., అదే... మన షంషాబాద్ ల పికప్ జేసుకుంటా సర్ మిమ్మల్ని"

ప్రస్తుతానికి ఇప్పటికీ నేను ఇండియా కెళితే భిక్షపతే నా కారు డ్రైవరు.

12 comments:

చిన్ని said...

ఉమగారు మీ డ్రైవర్ కథ చాల బాగుంది . కళ్ళకు కట్టినట్లు వర్ణించారు . మీలో మంచి రచయిత వున్నారు .

మురళి said...

"ఎవరు చెప్పొచ్చారు, రేపు భిక్షపతి వార్డు కౌన్సిలర్ కావచ్చు, అలా అలా ఇంకో పదేళ్ళకి ఎమ్మెల్యే కావచ్చు, తనలాంటి కొందరు తమ్ముళ్ళకి అన్నా కావచ్చు." నిజమేనండి.. అలా అయినవాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. భిక్షపతి గురించి చాలా తక్కువగా ఊహించుకున్నా.. 'బాషా' లో రజనీకాంత్ కి ఉన్నంత ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని అస్సలు అనుకోలేదు.. నవ్వు తెప్పించింది, ఆలోచన రేకెత్తించింది.. మొత్తంగా చాలా, చాలా బాగుంది.

ఉమాశంకర్ said...

@చిన్ని గారు
ధన్యవాదాలు. నిజానికి భిక్షపతి గురించి సీరియల్ లాగా కనీసం ఒక పది టపాలన్నా రాయొచ్చు. అంత ప్రతిభ ఉంది ఆయనకి..
@ మురళి గారు,
ధన్యవాదాలు. అవునండీ, చాలా మంది ఉన్నారు అలా..

సుజాత said...

చిన్ని గారితో ఏకీభవిస్తున్నాను ఉమాశంకర్ గారు! మీలో మంచి రచయిత ఉన్నాడు. మీరు కథలు రాయాల్సిందే! చాలా అద్భుతంగా నెరేట్ చేశారు.

ఉమాశంకర్ said...

సుజాత గారు,
నచ్చిందన్నమాట. :) ధన్యవాదాలు

పరిమళం said...

ఉమాశంకర్ గారూ ! బావుందండీ భిక్షపతి కధ ! కాస్త లేటుగా ఐనా లేటెస్ట్ గా వచ్చాడు కాబోయే కౌన్సిలర్.. :)

ఉమాశంకర్ said...

@ పరిమళం గారూ,
కాస్త కాదు చాలా లేట్ అయింది అనుకుంటా :). ధన్యవాదాలండీ.

Vinay Chakravarthi.Gogineni said...

goodone......baagundi........
carryon......

GIREESH K. said...

చాలా చక్కగా వ్రాసారు! మీరు కథలు వ్రాయడం మొదలుపెట్టొచ్చు.

మీరింతకమునుపు చెప్పినట్టు మనిద్దరి శైలీ చాల దగ్గరగా ఉంది (ofcourse, రాశిలోను, వాసిలోను మీతో సరితూగలేననుకోండి). మీ రచనలు చదువిన నా ఫ్రెండు కూడా ఇదేవిషయం చెప్పాడు. బహుశా, యండమూరి/మల్లాది ప్రభావమా?

ఉమాశంకర్ said...

గిరీష్ గారూ,

Thank you.

కావచ్చేమో? :)

Swetha said...

Umashankar gaaru,

entha baaga raasaarandi ee kathani....asalu edo patrikalo prachurithamaina kathalaa undi kaani....meeku nijangaa nija jeevitham lo jariginattugaa ledu

Alaa ani nenu mee anubhavaanni thakkuva chesthunnaanu ani kaadu....kaani...manalo entha mandhiko ilaanti anubhavaalu jaruguthaayi kaani ila kallaki kattinattugaa evaru cheppaleremo......paigaa akkadakka mee chamthkaaraalu...aaha...entha baaga undandi

serious gaa try chesthe mee kathalu anni patrikallo prachuritham ayye avakaasaalu unnaayandi....okka saari aa vaipu koodaa aalochinchandi

Mee tharvaathi tapaa kosam nenu kooda andari laaga veyi kallatho kaakapoyinaa rendu kallatho eduruchoosthunnaanu.

Keep up the good work
Swetha

ఉమాశంకర్ said...

Thank you Swetha.

 
అనంతం - by Templates para novo blogger