ఈ రోజేమీ బాలేదు

Friday, March 6, 2009

రోజేమీ బాలేదు నాకు.

పొద్దున్నే ఎందుకో బాగా ముందే మెలకువొచ్చింది. ఐదున్నరకి లేచా. ఆఫీసు పనేదో గుర్తొస్తే కాసేపు అది చూసుకున్నా. సడన్ గా రాత్రి మూడుగంటలప్పుడో, నాలుగ్గంటలప్పుడో, నా ఆఫీసు బ్లాక్ బెర్రీ "కుయ్ కుయ్" మన్నప్పుడు లేచి చూసుకున్న జీమెయిలు మెసేజీలు గుర్తొచ్చాయ్. జీ మెయిల్ ఓపెన్ చేసి చూస్తే నేను కొత్తగా రాసిన టపా కి కొన్ని కమెంట్లున్నాయి.అందరికీ రిప్లయిలిచ్చేసాను. దాదాపు అందరు నే సగం రాసి ఆపేసిన టపాని తిట్టుకొని, మర్యాదగా హెచ్చరించారు, తరువాయి భాగం త్వరగా రాయమని.

నేను బ్లాగుల్లో కొన్నిసార్లు ఏదైనా టపా ఓపెన్ చేసినప్పుడు టపా మరీ పేజీలకు పేజీలుంటే చదవకముందే నీరసపడిపోతాను. అయినప్పటికీ వాళ్ళు అంతకష్టపడి రాసినప్పుడు చదవకపోతే నాకే పాపం అని ఓపిగ్గా చదివి కమెంటేస్తా. అందుకే నాకు పెద్ద పెద్ద టపాలు రాయాలంటే చాలా భయం.అప్పుడప్పుడు మూడ్ బావున్నపుడు రాస్తూ ఉంటే ఆలోచనలు అలా ఆలా వస్తూ ఉంటాయి .వాటికి న్యాయం చెయ్యాలి అనిపించి, తద్వారా టపా సైజు పెరుగుతూ పోతుంది. అప్పటికీ రాసిందంతా మళ్లా చదువుకొని, మార్పులు చేర్పులు చేసి, అసందర్భం అనిపించినవన్నీ తీసేస్తా. అయినా కొన్నిసార్లు టపా సైజు నా అదుపులో ఉండదు.నేన్నిన్న కొత్తగా రాసిన టపా కూడా కారణంతోనే మధ్యలోనే ఆపేసి, అంతకుముందు అనుకున్న శీర్షిక మార్చి, అయిష్టంగానే పబ్లిష్ బటన్ నొక్కాను.

ఏదయితేనేం, బోలెడు బ్లాగు వర్కు పెండింగుంది నాకు. ఆల్రెడీ నెమలికన్ను మురళి గారు తనకి బాకీ ఉన్న టపా గురించి హెచ్చరించారు. అది రాయాలి. పైగా నిన్నరాసిన టపా పూర్తీ చెయ్యాలి. సరే ప్రయత్నిద్దాం అనుకుంటుండగా ఇంతలొ భాస్కర్ గారు రాసిన "దూడజచ్చింది " టపా నా కళ్ళబడింది. నా బాల్యంలో మా ఇంట్లో చనిపోయిన దూడలు గుర్తొచ్చి మనసు బాధగా మూలిగింది. అక్కడ ఒక కమెంటు రాసి,ఆఫీసుకి రెడి అయ్యి,ఏదో తిన్నాననిపించి,లంచ్ బాక్స్ , ఆఫీస్ బ్యాగ్ తీసుకొని ఆఫీసుకి బయలుదేరా. ఆఫీసు ఇంటికి పదిమైళ్ళ దూరం.ఒక ఆరు మైళ్ళు హైవే, ఒక నాలుగు మైళ్ళు లోకల్ రోడ్డు ప్రయాణం . హైవే పై ట్రాఫిక్ చాలా స్లో గా ఉంది. చాలా అసహనంగా డ్రైవ్ చేశా.లోకల్ రోడ్డు ఎక్కాక అలవాటు ప్రకారం ప్రతి గ్యాస్ స్టేషన్ లో ధర ఎంతుందో చూసుకుంటూ వస్తున్నా. ఇంకొద్ది దూరంలో గేటులేని రైల్వే ట్రాక్ వస్తుంది.అది దాటి ఎడమవైపు తిరిగి ఒక రెండు మైళ్ళు వెళ్తే అక్కడే మా ఆఫీసు. భాస్కర్ గారి టపా ప్రభావం నా బుర్ర మీద ఇంకా ఉన్నట్లుంది. శుక్రవారం అయినా ఎందుకో అంత సంతోషంగా లేను.

ఇంకొక్క రెండు సెకన్లలో రైల్వే గేటు దాటుతాననగా జరిగిందీ సంఘటన.

ముందు నా కారు కుడివైపున రోడ్డు పక్కన ఏదో కదిలినట్టనిపించింది. స్పీడ్ లిమిట్ 45 అయినా దాదాపు 55 మీద వెళ్తున్ననాకు మొదట అదేమిటో అర్ధం కాలేదు.రోడ్డు మీంచి దృష్టి మరల్చి పరీక్షగా చూస్తే ఉడత. ఆ స్పీడులో బ్రేక్ వేసి ఆపటం కల్ల. అప్పటికీ కాలు గేస్ పెడల్ మీంచి బ్రేక్ మీదికి మార్చేలోపే అది నా కుడివైపు ముందు చక్రం దాటి వచ్చేసింది.అంతకు మించి నాకేం కనపడలేదు. తరువాత ఏదో చిన్న శబ్దం. షాక్ నించి తేరుకొని టక్కున రియర్ వ్యూ అద్దం లో చూస్తే ఉడత పాపం రోడ్డుమీద పడుంది. సందేహం లేదు. అది నాకారు కింద పడ్డ ఉడతే. ఇంకో రెండు సెకన్లలో అది నా మిర్రర్ నుంచి కూడా అదృశ్యం అయిపొయింది.

ఒక్క క్షణం నా మెదడు మొద్దు బారి నట్టయింది. ఇంతకు ముందెప్పుడైనా ఇలా ఏవైనా నా కారుకింద పడి ఉండవచ్చేమో గాని, నాకు తెలిసి తెలిసీ, నేను చూస్తుండగా, జరగటం ఇదే ప్రధమం. షాక్ నుంచి తేరుకోగానే ,"జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు" అని నన్ను కన్విన్స్ చేసే పనిని చేపట్టింది నా మనసు.నా మనసు చెప్పిన మొదటి కారణం,అది నేను కావాలని చేసిన తప్పు కాదు అని. తరువాత దానికొచ్చిన రెండో ఆలోచన, స్పీడ్ లో అంత తక్కువదూరంలో బ్రేక్ వేసి కారు ఆపటం అనేది మానవమాత్రులకు అసాధ్యం.

"అప్పటికీ నువ్వు బ్రేక్ వేసి ఆపటానికి ప్రయత్నించావు కూడా ". బింకంగా కారణాలు వెతుకుతోంది నా మనసు.

నా ఈ ఆలోచనా పరంపరకి కొద్దిపాటి విరామం దొరకగానే నాకు వెంటనే ఘంటసాల భగవద్గీత గుర్తుకొచ్చింది. నాకు వేరే భగవద్గీతలు తెలీవు. తెలిసింది ఘంటసాల భగవద్గీతొక్కటే. చావు కబురు విన్నా దాని తాలూకు షాక్ నుంచి బయటపడగానే నాకు వెంటనే భగవద్గీతే గుర్తుకొస్తుంది. ముఖ్యంగా "పుట్టిన వానికి మరణము తప్పదు" అనే వాక్యం. నిజానికి సమయంలో నాకు సాంత్వన కలగజేసేది గీతే.

అయినా దాదాపు రోజూ ఇలా రోడ్డు మీద వాహనాల కింద పడి చనిపోయిన ఉడతల్ని, తొండల్ని చూడ్డం నాకు కొత్తేం కాదు. కాని ఇది నా కారుకింద, అందునా నా కళ్ళ ముందు జరిగే సరికి తట్టుకోలేక పోతున్నాను. ఇంతటితో నా ఆలోచనలు ఆగిపోతే నేను అదృష్టవంతుని కిందే లెక్క. కానీ అలా జరగలేదు.

అన్ని జీవుల్లాగే తను కూడా పాపం ఊహించి ఉండదు ఈ రోజిది జరగబోతోందని. పొద్దున్నేనిద్ర లెగవగానే రోజూ ఎప్పటిలా తనకి బాగా ఆహారం దొరకాలని అనుకొనుంటుంది. కాని ఇలా నా కారు కింద పడాలని రాసిపెట్టుందని దానికి తెలీదు. అవును ఇంతకీ అది పెద్ద ఉడతా ? పిల్ల ఉడతా? ఏదయితేనేం?ఒకవేళ పెద్ద ఉడుతయితే పిల్ల ఉడతలు ఎంతలా ఎదురు చూస్తుంటాయో కదా ఇంకా తిరిగి రాలేదని? పిల్ల ఉడుతయినా అదేపరిస్థితి. ఇంకా ఇంటికి రాని పిల్ల కోసం పెద్దుడత ఎంతలా ఎదురు చూస్తుందో కదా? అవునూ, ఉడతలలో ఫ్యామిలి కాన్సెప్టుందా? డిస్కవరీ లో, నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ లో చాలా జంతువుల గురించి చూసా గాని, ఉడతల గురించి ఎప్పుడూ చూసిన గుర్తు లేదు.

ఆఫీసు కొచ్చినా అదే ఆలోచన. ప్రతిజీవికీ ఆత్మ ఉంటుంది కదా. అలా ఉడత ఆత్మ ఇప్పుడు నన్నే చూస్తుందేమో?నా టేబిల్ ని పరికించి చూసాను. ఒక పక్కగా ఫోను, పక్కనే నా కాఫీ మగ్, దానిముందు ప్లాంటర్స్ వేయించిన జీడిపప్పు, నా ఎదురుగా నా లాప్టాప్, కుడివైపు మౌస్ పేడ్, మౌస్, పక్కన నా రెండు సెల్ ఫోన్లు. అదిగో అక్కడ టేబిల్ చివర్న, అక్కడ నిలబడి నావైపే చూస్తోందేమో దీనంగా, ఎందుకిలా చేసావ్ అంటూ?

ఏనిమేషన్ సినిమాల్ని విపరీతంగా అభిమానించే నాకు , ఒక్కసారి దాని అమాయకపు మొహాన్ని ఊహించుకోగానే మనసు భారమయింది.

ఆఫీసు పని మీద మనస్సు లగ్నం కావటం లేదు. ఆలోచన మళ్లీ మొదటికొచ్చింది. అస్సలు కరెక్ట్ గా టైములోనే నా కారు అక్కడికెందుకు రావాలి? ఒక రెండు సెకన్లు ముందో వెనకో వచ్చుంటే ఎంత బాగుండేది. అసలే స్పీడ్ లిమిట్ కి ఐదు మైళ్ళు ఎక్కువ వేగం తో వెళ్తా నేనెప్పుడూ. అంతకు మించిన వేగం నాకే ప్రమాదకరం.సో, ముందు రావటం కంటే , స్లో గా , లేట్ గా వచ్చుంటే బాగుండేది.

ఒక్కసారి పొద్దున్న జరిగిందంతా స్లో మోషన్ లో రివైండ్ చేసుకున్నా..

నిజానికి నేను ఆఫీసు కి బయలు దేరేటప్పుడు లంచ్ బాక్స్ తీసుకొని సగం మెట్లు కిందకి దిగి అంతలోనే, ఇంకా నిద్ర లేవని శ్రీమతి గుర్తుకు వచ్చి, మళ్లా పైకి బెడ్రూం లోకెళ్ళి , ఒకవేళ తను లేచి ఉంటే "వెళ్ళొస్తా" అని చెప్దామని చూసా. తనింకా నిద్ర లేవలేదు. సరే అనుకోని, కిందకొచ్చాక అప్పుడు గుర్తొచ్చింది, లంచ్ బాక్స్ ని ఇందాక పైకెళ్ళినప్పుడు డైనింగు టేబిల్ మీద పెట్టి మర్చిపోయానని. మళ్ళా ఉసూరుమంటూ వెళ్లి దాన్ని తీసుకొని బయలుదేరా. ఎవరో చెప్పారు వింటర్ లో కారు స్టార్ట్ చేసాక ఇంజన్ వేడెక్కే దాకా కాసేపు గాలి,వెంటనే బయలుదేరకూడదు అని. కాని ఈరోజు ఎనిమిదిన్నరకి మీటింగు ఉంది, దానికి కాస్త ప్రిపేర్ అవ్వాల్సి ఉండటంతో వెంటనే బయలుదేరా. హైవే మీద కూడా ఎవ్వరూ దారివ్వక పోవటంతో వాహనాలను ఓవర్ టెక్ చెయ్యటానికి అక్కడక్కడ స్పీడ్ 80 దాటాల్సోచ్చింది. అలా ఎన్నడూ చేయలేదు. ఎందుకంటే బోడి ఆరు మైళ్ళలో నేనీ తతంగాలన్ని చేసేసరికి నేదిగాల్సిన ఎగ్జిట్ వచ్చేస్తుంది. పైగా ఈరోజు లోకల్ రోడ్డు లో ఒక చోట " No right on red" లో వాహనాలేమీ రావట్లేదు కదా అని టర్నింగు తీసేసుకున్నా. లోకల్ రోడ్డు మీద కొన్ని చోట్ల స్పీడ్ లిమిట్ 35, మరి కొన్ని చోట్ల 45 ఉంటుంది. నేను అన్నిచోట్లా అనుమతించిన దానికన్న పది మైళ్ళు ఎక్కువ వేగం తోనే వెళ్ళా. ఇన్ని చోట్ల నా రోజువారీ దినచర్యనీ, అన్నిటికీ మించి చట్టాన్నీ అతిక్రమించాను కాబట్టి నేరం నాదే అనిపిస్తోంది. వీటిల్లో ఒక్కదాన్ని నేను తద్విరుద్ధంగా చేసుంటే ఆ ఉడత పాటికి తనకి దొరికిన వేరుశనగపప్పు నో , చెట్టు మీంచి పడ్డ కాయనో తింటూ హాయిగా ఉండేది కదా?

జరిగిందేదో జరిగిపోయింది. నేనింటి కెళ్ళాలంటే వేరే దారి లేదు. ఇదొక్కటే దారి. ఇకనుంచి రోజూ అక్కడికి రాగానే నాకా అభాగ్యజీవి గుర్తుకు రావడం తధ్యం. రోజుకు రెండు సార్లు X ప్రాజెక్టు ఉన్నన్నాళ్ళు. ఇది గాక నేనెప్పుడూ ఇష్టంగా చూసే ఏనిమేషన్ సినిమాల్లో ఉడత క్యారెక్టర్ ఉంటే బహుశా అది ఎంత మంచి సినిమా అయినా ఎంజాయ్ చెయ్యలేనేమో.

రోజేమీ బాలేదు నాకు.
 
అనంతం - by Templates para novo blogger