ఒక చిన్న మాట

Thursday, February 26, 2009

కొన్ని నెలల క్రితం నేనొకసారి టెన్నిస్ ఆడడానికి మా ఇంటి దగ్గర్లో, ఒక పార్క్ లోనున్న టెన్నిస్ కోర్టుకెళ్ళాను. ఉన్నవే రెండు కోర్టులు. ఒకదాంట్లో తెల్లవాళ్ళు గ్రూపొకటి , దాదాపు ఐదారుగురు, వంతులవారీ గా ఆడుకుంటున్నారు. రెండవదాంట్లో మన భారతీయ మిత్రులు ఇద్దరు ఆడుతున్నారు. నేను, నాతోపాటు వచ్చిన నా స్నేహితుడు దాదాపు నలభై నిముషాలు వేచిఉన్నాం. మన భారతీయ మిత్రులు అరివీర భయంకరం గా తమ టెన్నిస్ ప్రావీణ్యాన్నంతా మాకు చూపిస్తున్నారు గానీ, తోటి వాళ్ళు వేచి యున్నారు కదా వాళ్ళకి కూడా అవకాశం కలిగిద్దాం అనే కనీసపు ఆలోచన కొరవడింది. మనుషుల మీద మరీ అంత చులకన భావం ఏమిటి అని నాకైతే చిరాకు వేసింది. చివరికి మమ్మల్నిఎంతో సేపు నుంచి గమనిస్తున్న ఆ రెండవ కోర్టు వారు మేము వారిస్తున్నా వినకుండా మాకోసం కోర్టు ఖాళీ చేసి ఆడుకోండంటూ చెప్పి వెళ్ళిపోయారు. రెండు విధాలా తల కొట్టేసినట్లైంది నాకు. మనవాళ్ళు అందరూ ఇలా ఉంటారు అని అనటం నా మూర్ఖత్వమే అవుతుంది. కాని ఇలాంటి పోకడలు ఎంత చిన్నవయినా, సంఖ్యలో తక్కువైనా, ప్రస్తుత పరిస్థితుల్లో వాటి ప్రభావం తిరిగి మనమీద చాలా ఎక్కువ ఉంటుంది అనేది నా అభిప్రాయం.

ప్రపంచం మారిపోతోంది. ఒక పదేళ్ళ క్రితం ఉన్న పరిస్థితులకీ, ఇప్పటికీ, ఆలోచనల్లో చాలా మార్పులొచ్చాయి. ఏ దేశాన్ని చూసినా అసహనం రాజ్యమేలుతోంది. పరిధిలు కుచించుకు పోతున్నాయ్. మొన్న నాతో బాగా చనువుగా ఉండే మా మానేజరు ఏదో విషయంలో మాట్లాడుతూ అసలు మీ భారతీయులు ఈ దేశంలో ఉన్నారంటే it is just becoz of your brains అన్నాడు. పైకి అది మెప్పుకోలు లా ఉన్నా ఆ సందర్భాన్ని బట్టి అది ఒకరకమైన నిరసన. ఆ తరువాత అలా నోరు జారినందుకు తను కొద్ది గా నొచ్చుకొన్నాడు కూడా. అసంకల్పితంగా,మాటల్లో ఆయన మనసులోని భావం అలా బయటికి వచ్చింది. ముఖ్యం గా 9/11 తరువాత వాళ్ళ దృక్పధం లో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఒక అరబ్(ముస్లిం) ని చూస్తే వాళ్ళ నొసలు ముడిపడుతున్నాయి. ఈ TV, రేడియో టాక్ షోల ప్రభావమేమో మరి, బయటి దేశం నుంచి వచ్చిన వాళ్ళని ఇంతకి ముందులా మనఃస్పూర్తిగా ఆహ్వానించలేక పోతున్నారు. బయటి వాళ్ళు ఇక్కడికి వచ్చి తమ ఉద్యోగాల్ని, తద్వారా తమ నోటికాడ కూడుని లాగేసుకుంటున్నారనే ఒకరకమైన భావం వీళ్ళని స్థిమితపడనివ్వటంలేదు. అవుట్ సోర్సింగ్ అంటేనే ఇంతెత్తున ఎగిరి పడుతున్నారు. పులి మీద పుట్ర లా ఈ ఎకానమీ. ఇటువంటి పరిస్థితుల్లో మరింత జాగరూకతతో మెలగవలసిన బాధ్యత మనదే. మన ప్రవర్తన, మనంవేసే ప్రతి అడుగూ, మనం మాట్లాడే ప్రతి మాటా మనదేశంలో ఉన్న 100కోట్ల పైచిలుకు భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తుందనే స్పృహ ఎల్లవేళలా ఉండాల్సిన అవసరం ఉంది. "వీళ్ళందరూ ఇంతే" అనే నిరసనతో కూడిన అభిప్రాయాన్ని వీళ్ళకు కలగనివ్వకూడదు.

26 comments:

teresa said...

మీ ఫస్ట్ పేరా నాకూ చిరపరిచితమే! కోర్టు పక్కనే భార్య పిల్లలు స్టీలు కేరియర్లో తెచ్చుకున్న జంతికలు , సున్నుండలు తింటూ మధ్య మధ్య లో తెలుగులో అరుస్తూ ఉంటారు :(

ఉమాశంకర్ said...

@ teresa గారు,

Thank you.

మన భాష రాదు కదా అని, వాళ్ళముందే వాళ్ళ గురిచి పక్క నున్న వారితో కమెంటు చెయ్యడం, షాపుల్లో వారంటీని దుర్వినియోగం చెయ్యడం.. ఇలాంటివెన్నో...

Vamsi M Maganti said...

ఓస్ ఇంతేనా....ఇలాటివి బోలెడు సిత్రాలు ఈ క్రౌంచ ద్వీపంలో - మన పరువు, పనసకాయ తీసేవి...చిట్టా విప్పితే చిత్రగుప్తుడు నొచ్చుకుంటాడు అని ఆ పరమపిత అంటేనూ, ఊరకుంటున్నా....

Rani said...

మీరు వాళ్ళ టాలెంట్ ని ముచ్చటగా చూడడానికి వచ్చారు అనుకున్నారేమొ :P

ఉమాశంకర్ said...

@ వంశీ గారు:
:)

మూణ్ణెల్లు వారంటీ ఉంది కదా అని 2500 డాలర్ల టీవీ ని కరెక్టుగా తొంభయ్యోరోజు షాపు మూయటానికి ఇంకొక పది నిముషాలుందనగా వచ్చి ఏదో సాకు చెప్పి రిటర్న్ చేస్తే ఎవరికైనా ఎలా ఉంటుంది చెప్పండి..ఇది రాయటానికి కారణం ఇదే..

అబ్రకదబ్ర said...

సారూ, ఆ టెన్నిస్ వీరులు బోలెడు నయం. నేనింకో సిత్రం సెబుతా ఇనుకోండి - సిలికాన్ వ్యాలీ సిత్రం ఇది.

నిన్న నా డ్రైవింగ్ లైసెన్స్ పొడిగించటానికి డిఎమ్‌వి కెళ్లా. ముందే అపాయింట్‌మెంట్ తీసుకోకపోవటం వల్ల లైన్లో నిలబడాల్సొచ్చింది. ఓ పంజాబీ ఆవిడ - యాభయ్యేళ్లుంటాయేమో - సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుందక్కడ. ఆవిడ హడావిడి చూడాలి. మనూళ్లలో పోలీసు ఎస్సైలుంటారు కదా, వాళ్లని మించి చెలాయిస్తుంది. ఆంగ్లం కూడా సరిగా రాదామెకి. రుబాబు మాత్రం అదరగొట్టేస్తుంది. నేనక్కడున్న పావు గంటలో ముగ్గురు అమెరికన్లని లైన్లో పక్కనోళ్లతో మాట్లాడుతున్నారని, వాళ్ల టికెట్ నంబర్ పిలిచిన వెంటనే పలకలేదని .. ఇలా అర్ధం లేని కారణాలతో ఇంత మొహమేసుకుని వాయించేసింది. పాపమా అమెరికన్ల మొహాలు చూడాలి. అసలక్కడ ఆమె విసుక్కోవాల్సిన విషయాలేమీ లేవు. ఒకవేళ ఏమన్నా ఉన్నా కాస్త నవ్వు ముఖంతో చెప్పొచ్చు కదా. పురుగుల్లా తీసిపారేయటమేంటి? అసలే వాళ్ల దేశంలో ఉద్యోగాలు మనం తన్నుకు పోతున్నామని ఏడుస్తున్నారు వాళ్లు. ఇప్పుడామె ఏకంగా ఓ ప్రభుత్వాఫీసులో ఉద్యోగం చేస్తూ ఇలాంటి పన్లు చేస్తుంటే వాళ్లకింకెంత కాలుతుంది? మనూళ్లలో ప్రభుత్వాఫీసుల్లో చైనా వాడెవడో వచ్చి పని చేస్తూ మనల్నిలాగే తీసిపారేస్తే వాడి గుండు పగలగొట్టమూ?

జీడిపప్పు said...

ఒక సగటు పాతికేళ్ళ భారతీయుడి కంటే ఏడేళ్ళ అమెరికన్ పిల్లవాడికి ఎక్కువ సంస్కారం ఉంటుంది.

ఉమాశంకర్ said...

@ రాణి గారు:
:) ధన్యవాదాలు
@అబ్రకదబ్ర గారు, జీడిపప్పుగారు:
మీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు.
అబ్రకదబ్ర గారు:
అంతే కదా మరి. స్వతహాగా వీళ్ళు స్నేహశీలులు. మన ప్రవర్తనని బట్టే వాళ్ళు మనకి ఎంత దగ్గరవుతారు అనేది ఆధారపడి ఉంటుంది.

పక్క లైను వారితో మాట్లాడితే తప్పా? దారుణం. ఇక్కడ స్కూళ్ళలోకూడా అంత స్ట్రిక్ట్ గా ఉండరేమో?
జీడిపప్పు గారు:
:)

cbrao said...

అమెరికన్ దేశస్తులు మర్యాదస్తులు. క్యూ పద్ధతి పాటిస్తారు. ఎదైనా అడిగితే చిరుహాసంతో తగిన సమాచారమిస్తారు. సాయంకాలం వాహ్యాళి కెళితే ఎదురైనప్పుడు నవ్వుతూ హలో అంటూ పలుకరిస్తారు, మనం తెలియకపోయినా. ఏదైనా విషయంలో వారి అసమ్మతిని కూడా మర్యాదపూర్వకంగా వెళ్లడిస్తారు.

ఉమాశంకర్ said...

@సి.బి.రావు గారు,
కరెక్టుగా చెప్పారు. మనం కూడా అలాంటి ప్రవర్తననే వారికి తిరిగిస్తే ఎంత బాగుంటుందో కదా..

మురళి said...

కొంచం ఆలస్యంగా స్పందిస్తున్నా.. ప్రారంభం చూసి టెన్నిస్ గురించి అనుకున్నా.. ఇలా మరికొన్నాళ్ళు సాగితే 'ఇండియన్ కల్చర్' అనేది విదేశీయులకి ఓ జోక్ గా మారుతుందేమో.. మంచి టపా..

ఉమాశంకర్ said...

మురళి గారు:
ధన్యవాదాలు.
ఆ మరికొన్నాళ్ళు ఎంతోదూరం లేదనిపిస్తోంది నాకు. ప్చ్......

మధుర వాణి said...

ఉమాశంకర్ గారూ..
మీరు చెప్పింది వంద శాతం నిజం.. బహు చక్కని టపా..!
నేను కూడా చాలా మందిని చూశాను. వాళ్లకి అర్ధం కాదు కదా.. అని జోక్స్ వేసుకోడం, క్రెడిట్ కార్డు లోన్స్ తీసుకుని.. ఎగ్గొట్టేసి చెప్పకుండా వెళ్ళిపోవడం.. లాంటివి..ఒక్క మనిషి చేసే వెధవ పనుల వల్ల.. చాలామందికి ఇండియన్స్ అంటే ఇంతే అనే ఫీలింగ్ కూడా వస్తుంది ;)

"మన ప్రవర్తన, మనంవేసే ప్రతి అడుగూ, మనం మాట్లాడే ప్రతి మాటా మనదేశంలో ఉన్న 100కోట్ల పైచిలుకు భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తుందనే స్పృహ ఎల్లవేళలా ఉండాల్సిన అవసరం ఉంది. "వీళ్ళందరూ ఇంతే" అనే నిరసనతో కూడిన అభిప్రాయాన్ని వీళ్ళకు కలగనివ్వకూడదు."
ఇది మాత్రం అక్షర సత్యం. ఇండియా నుంచి బయటికి వచ్చిన ప్రతీ వ్యక్తి గుర్తుంచుకోవాల్సిన విషయం.

ఉమాశంకర్ said...

@ మధురవాణి గారు:
Thank you :)

Bhavani said...

"మన ప్రవర్తన, మనంవేసే ప్రతి అడుగూ, మనం మాట్లాడే ప్రతి మాటా మనదేశంలో ఉన్న 100కోట్ల పైచిలుకు భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తుందనే స్పృహ ఎల్లవేళలా ఉండాల్సిన అవసరం ఉంది. "వీళ్ళందరూ ఇంతే" అనే నిరసనతో కూడిన అభిప్రాయాన్ని వీళ్ళకు కలగనివ్వకూడదు."

ఈ విషయం ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాను.

ఉమాశంకర్ said...

@భవాని గారు:
ధన్యవాదాలు.
బయట ఇవి చూసీ చూసీ చాలా బాధ వేసి రాసాను.

Surabhi said...

Absolutely true Umashanker gaaru.
I have seen many such incidents too. Just to cite one, there is a person at my work, when he talks on the phone atleast people around next 10 aisles can hear even if they close the ears and he keeps on talking everyday atleast for an hr to 2hrs in the native language. Since I can understand telugu , I know whole of his family, and that his wife is expecting and the property he is planning to buy his future plans and everything about him. By the way I never talked to him and I sit 5 aisles away from his. During the office hrs when all t others are busy having meetings, teleconfernce and other activities it is so embarrassing to be there. And last month I couldn’t resist any longer when he was talking to his pregnant wife about the care she needs to take and the questions she should ask the doctor on her next visit and about the american insurance policies and problems with kids here during the lunch time I went and said to him to be mindful about the people around him and don’t take it for granted .Though they don’t understand the language they can feel the sound

ఉమాశంకర్ said...

@సురభి గారు:
అవునండి, ఇలా చాలా ఉన్నాయి. ఎక్కువ శ్రమ లేకుండా, చాలా సులభంగా ఈ అలవాట్లు మార్చుకోవచ్చు మనవాళ్ళు. చిన్నపాటి ప్రయత్నం చాలు..

teresa said...

@ surabhi- ఎడా పెడా lay-off లిస్తున్న ఈ రోజుల్లో అతని ఉద్యోగం ఎలా నిలుపుకుంటున్నాడో!!
వంశీ గారన్నట్లు చిట్టా విప్పితే చానా పొడుగవుతుంది గానీ ఇదొక్కటీ చెప్పి ముగిస్తా. లాస్ట్‌ వీక్ ప్రయాణం చేస్తూ ఒక ఏర్‌పోర్ట్‌ లో వెయిట్‌ చేస్తున్నప్పుడు ఒక తెలుగతను సెల్‌ ఫోనులో మాటాడుతూ నా ఎదురు
గా వచ్చి కూర్చున్నాడు. జేరగిలబడి కాళ్ళూపుకుంటూ తెలుగులో అరుస్తున్న ఈ హీరో గార్కి deodorant/Antiperspirant అన్న వస్తువుంటుందని తెలీదు . అతనికి అటూ, ఇటూ ఉన్న ఇద్దరు మధ్య వయసు అమెరికన్లూ అప్పటివరకూ సీరియస్‌గా ల్యాప్తాప్‌ లో పని చేస్కుంటున్నారు, ఆ పక్కనే ఉన్న కాలేజి పిల్ల చదూకుంటోంది, నేను జలుబు, జ్వరం ,తలనెప్పితో నెత్తి పట్టుక్కూర్చున్నాను. 15 నిమిషాల పాటు మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషనూ లేకుండా ఓపిగ్గా ఊరుకున్న ఇద్దరు మధ్య వయస్కులూ నెమ్మదిగా బేగ్‌ సర్దుకుని లేచి వెళ్ళిపోయారు. ఆ భాషని అంత వెకిలిగా మాటాడొచ్చని అర్థమవుతున్న పాపానికి నేనూ నెమ్మదిగా నా లాడూ, బీడూ లాక్కుంటూ బయల్దేరి అవతలి గేట్‌లో చతికిల బడ్డాను. At times like these, I really don't feel like revealing my Indian origin :(

చివుకుల కృష్ణమోహన్‌ said...

@ఉమాశంకర్,తెరెసా,వంశీ, అబ్రకదబ్ర, సీబీరావు, జీడిపప్పు, మురళి,మధురవాణి - మీలో ఎందరు అమెరికాలో ఉన్నవారో నాకు తెలియదు. ఉన్నవారందరూ భారతీయ సంస్కృతిని కాపాడుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. నిజంగా మీరు/మీలాంటివాళ్ళు కొందరైనా లేకపోతే ఈపాటికే రెపరెపలాడుతున్న భారతీయసంస్కృతీ దీపం కొడిగట్టిపోయిఉండేది. ధన్యవాదాలు.
ఇదేమిటీ.. నిజంగానండి బాబూ, నేనేమీ వెక్కిరించటం లేదు. నిజంగానే ధన్యవాదాలు.

భావన said...

ఉమా శంకర్ గారు,
బాగుందండి మీ అనుభవం.. మీరు చెప్పినవి నిజమే కాని నాణేనికి ఇంకో పక్క కూడా వుంటుంది అండి... మన వాళ్ళు మెత్త గా వుంటే technical work అంతా మనతో చేయించుకుని కర్ర పెత్తనం చేసే తెల్ల దొర లు ఎందరో.. అర్ధం అయ్యి కానట్లు మన వాళ్ళ jackets నుంచి అల్లం వెల్లులి వాసనలను హేళన చేస్తూ సన్న సన్నగా సన్నయి నొక్కులతో నవ్వే వాళ్ళు ఎందరో... ఎంతో ఎగతాళి గా వీళ్ళకు racism అంటే ఏమిటో తెలియనట్లు మీవూర్లో కులాలు వుంటాయి అట కదా అని అడిగి కొత్త గా వచ్చిన వాళ్ళు తెలియక ఏదో వెర్రి గా సమాధానం ఇస్తుంటే తల పక్క కు తిప్పి కళ్ళతో నవ్వే వాళ్ళు ఎందరో.. మంచి వాళ్ళు వుండరని నేను అనలేదు కాని వాళ్ళూ వుంటారు వీళ్ళు వుంటారు...ఇంకో రకం వుంటారు మీరు tennis లో చూసిన వాళ్ళ లా.. తోటి భారతీయుల మీద వాళ్ళ ప్రతాపం చూపిస్తారు అసలు మాట్లాడవలసిన చోట వాళ్ళ హక్కుల కోసం అడగవలసిన చోట చతికిల ఫడతారు....క్షమించాలి ఎవరికైనా కోపం తెప్పిస్తే ఈ వ్యాఖ్య తో...

ఉమాశంకర్ said...

భావన గారు,
మీరు మీ అభిప్రాయం చెప్పారు, అందులో తప్పేమీ లేదు.
ఆఫీసు పాలిటిక్స్ లో కొస్తే మీరన్నది నిజమే కావచ్చు. కానీ నా టపా ఉద్దేశ్యం అది కాదు. ఆఫీసు పక్కన పెట్టండి. బయట మనవాళ్ళు పాటించే పద్దతులు, వీరు పాటించే పద్దతులు చూడండి. తేడా తెలుస్తుంది. సివిక్ సెన్స్ విషయానికొస్తే మనవాళ్ళు ఇక్కడనే కాదు, ఎక్కడైనా వెనకపడే ఉంటారు.

ఎక్సెప్షన్స్ రెండువైపులా ఉంటాయి. మొత్తం మీద చూస్తే ఎంతైనా వీరు సివిక్ సెన్స్ లో మనకంటే చాలా బెటరు.

భావన said...

పోద్దురు... వీళ్ళ సివిక్ సెన్స్ లేదు ఎకార్డ్ సెన్స్ లేదు... కుంచం మంది జనాభా కదా అలానే వుంటుంది.. మనమేమో జనం తో క్షణం క్షణం తగాదా అనుక్షణం పోరాటం ఇంక పక్క వాడిని పట్టించుకునే ఆలోచన వుండదు.. ఇక్కడకు వచ్చాక మారితే బాగానే వుంటుంది... కాని మార్పు అంత సులభమా చెప్పండి.. ఇక్కడ జనాభా బాగా ఎక్కువ వున్న చోట్ల కు వెళ్ళండి.. అంతెందుకు బాగా రష్ గా వున్న మాల్ లో డిసెంబర్ 25 అప్పుడు వెళ్ళండి వీళ్ళు ఎంత పాటి మర్యాద పాటిస్తారో పార్కింగ్ ల దగ్గర.. మేము NH నుంచి NY వెళితేనే కిందా మీదా ఐపోతాము అక్కడ వాళ్ళు అలా sorry లు చెప్పకుండా అలా తోసుకుంటూ తొక్కుకుంటు వెళ్ళిపోతుంటే (తెల్ల వాళ్ళే సుమి), అక్కడ మా స్నేహితులేమో మమ్ములను మరి గేలి చేస్తారు అబ్బ ఈ పల్లెటురి వాళ్ళతో చస్తున్నాము బాబు మా వూరిలో జనాలకు పనులుంటాయి మీ వురి లో లా కాదు అని... :) మంది ఎక్కువ ఐతే మరి మజ్జిగ పలుచన అవుతుంది మరి...

ఉమాశంకర్ said...

భావన గారు,

మనం ఇంట్లో లివింగు రూం లో ఒకలా ఉంటాము. అదే ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు మనం వేసుకొనే డ్రస్ కానీ, ఆ పార్టీ లో మన ప్రవర్తన గానీ, అనుక్షణం మన మనసు మనకి మనం పదుగురిలో ఉన్నామని గుర్తు చేస్తున్నట్టే ఉంటుంది.. అదే పార్టీ లో ఎవరైనా పెద్దగా అరచినట్టు మాట్లాడడమో, క్రూడ్ జోక్స్ వేయటమో చేసారనుకోండి, దానర్ధం మీకు కూడా అలా చెయ్యొచ్చు అని చెప్పినట్టా?కాదు కదా.. ఆ ప్రవర్తన మనకి ఆమోదయోగ్యం కాదు. ఇది కూడా అంతే..

నేనేమీ వీళ్ళని వెనకేసుకురావటం లేదు. పోయిన Thanks giving సేల్స్ తొక్కిసలాట లో NY లో అనుకుంటా, ఒక వాల్మార్ట్ ఉద్యోగి చనిపోయాడు. అయినా ఆ రోజు ఆ స్టోరు అమ్మకాలు యధావిధిగా కొనసాగాయి..

మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ ఒకామె ఒక చిన్న ఆక్సిడెంట్ చేసింది. తనదే తప్పు. అవతల తెల్లామె "పర్లేదు, నాకేమీ కాలేదు" అని అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఒక వారం తరువాత సూ చేసింది, కేసు మూడేళ్ళ నుంచి నడుస్తోంది.. ఆ వారం లో ఎవరో ఆమెకి "బ్రెయిన్ వాష్" చేసారని అనుకుంటున్నాను నేను..

ఎదుటివాళ్ళు చేసినంత మాత్రాన చెడు మంచి కాదు కదా. మనం వేరే దేశానికి వచ్చినప్పుడు ఇంకా జాగ్రత్త గా ఉండాలని మాత్రమే చెప్పాను..

మంచి చెడు లని మీరు మీకెదురైన అనుభవాలతో "సబ్జెక్టివ్" గా ఆలోచిస్తున్నారనిపిస్తోంది.

నేను నా పై వ్యాఖ్య లో రాసిన చిట్టచివరి వాక్యం నిజమని గట్టిగా విశ్వసిస్తాను.
నా వ్యాఖ్య మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి..

భావన said...

లేదు ఉమ గారు.. నేను వ్యక్తిగతం గా నా అనుభవాలతో క్రోడీకరించటం లేదు.. ఏమిటో మన వాళ్ళు అని చురుక్కుమంది.. మీరు చెప్పినవాటిలో నేను చెప్పినవాటిలో కొన్నిటిని ఐనా ఈ సుధీర్ఘ అమెరికా యాత్ర లో అందరు చవి చుసే వుంటాము. :-) సరే ఈ వాదనలకు ఏమి కాని చాలా చాలా నచ్చిందండి మీ బ్లాగ్.. సరళమైన శైలి.

ఉమాశంకర్ said...

@ భావన గారు,

Thank you. :)

 
అనంతం - by Templates para novo blogger