అరచేతిలో గ్రంథాలయం

Wednesday, February 18, 2009
కొన్నేళ్ళ క్రితం, తామరతంపరగా వచ్చిన ఈ టెలివిజన్ ఛానళ్ళూ, లైవ్ కవరేజిలూ, సెల్ ఫోన్లూ, ఇంటెర్నెట్టూ, ఇవన్నీ చూసి నోరెళ్ళబెట్టినా, "కొన్ని విషయాలకు మాత్రం ప్రత్యమ్నాయం ఉండదు ఉండబోదు.చాలా మంది కొన్నిటిని అలా సహజంగా చూడటానికే ఇష్టపడతారు.టెక్నాలజీ వీటినేం చేయలేదు" అని అనుకునేవాడిని. అలా నేను అనుకున్నవాటిలో మొట్టమొదటిది పొద్దున్నే చదివే న్యూస్ పేపరు. కుర్చీ కిటికీ పక్కకు లాక్కొని, ఆ ఉదయపు నీరెండ చురుక్కుమనిపిస్తుంటే, కాఫీ తాగుతూనో, లేదా వేసవిలో బాల్కనీలో ఆ ఉదయపు చల్లగాలిని ఆస్వాదిస్తునో, పేపరు చదవడంలో ఉన్న ఆనందానికి ఏ టెక్నాలజీ ప్రత్యామ్నాయం కాదు అని భ్రమపడ్డాను. సరిగ్గా ఐదేళ్ళ తరువాత, మాతృదేశాన్ని వీడి వచ్చాక, ఆ అనుభవం నిజంగానే గతకాలపు స్మృతిలా చురుక్కు మనిపిస్తోంది. దూరంగా ఉన్నాను కాబట్టి సర్దుకుపోవడమే కావచ్చు. కానీ ఇప్పుడు నా ఆన్లైన్ పేపరు పఠనం మరీ అంత అసహజంగా అనిపించటంలేదు. ఇంకొక ఐదేళ్ళు పొతే పేపరు చదవడానికి ఇదే సరైన పద్దతి అని వాదిస్తానేమో. ఇష్టమైన ఆర్టికల్స్ ను కత్తెరుచ్చుకుని కట్ చేసి, పంచ్ చేసి, ఫైళ్ళలో భద్రపర్చుకొని, పాత బడ్డక వాటిని అటు పారేయలేకా ఇటు సర్దనూలేక సతమత మయ్యే బదులు చక్కగా కంప్యూటర్లోనే భద్ర పరచుకోవచ్చు. పది పదిహేను రోజుల కిందటి పేపరు కావాలంటే నిమిషాల్లో లభ్యం. టేబిలు కింద దూరి ఆ దుమ్ములో పాత పేపర్ల కట్ట మీద దాడి చెయ్యాల్సిన అవసరం లేదు. ఇలా ఉన్నాయి నా ప్రస్తుత ఆలోచనలు.

సరే ఈ సుత్తంతా ఎందుకు, డైరక్టు గా విషయం లో కొచ్చేస్తాను. అమెజాన్ వారు ఒక సంవత్సరం క్రితం "కిండిల్" అనే ఒక ఈ-బుక్ రీడర్ ని ప్రవేశపెట్టారు. ఇది పుస్తకానికి ప్రత్యామ్నాయం. ఒక ఐదు వందల పేజిల నవల కూడా మన అరచేతిలో ఇట్టే ఇమిడి పోతుంది.అవసరమనుకుంటే ఇది ఆ పుస్తకాన్ని మనకి చదివి కూడా వినిపిస్తుంది. అయితే ఆ విషయం లో అమెజాన్ వారికి ఎవో న్యాయపరమైన ఇబ్బందులున్నాయట. ఇది 3G వైర్ లెస్ టెక్నాలజీలో పని చేస్తుంది. మనం చదవాల్సిన పుస్తకాన్ని అమెజాన్ వారి సైటు నుంచి ఈ పరికరం లోకి డౌన్ లోడ్ చేసుకోవాలన్నమాట. ప్రస్తుతానికి దాదాపు రెండులక్షల ముప్పై వేల పుస్తకాలు ఈ కిండల్ లొ చదవదగ్గ ఫార్మాట్ లో లభ్యం. ప్రస్తుతానికి మార్కెట్ లోకి రాబోతున్న ది కిండిల్ 2. అంతకు ముందు వచ్చిన మోడల్ తో పోలిస్తే ఇందులో చాలా మార్పులు చేసారు. అమెజాన్ వారి సైటు నుంచి పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకున్నాక దాన్ని స్టొర్ చేసుకొనే అవకాశం కూడా ఉంది. ఈ విధంగా దాదాపు పదిహేను వందల పుస్తకాలని మీతోటే ఉంచొకోవచ్చు, తీసుకెళ్ళొచ్చు ఎక్కడికైనా. మనం షాపులో కొన్నట్లే ప్రతి పుస్తకానికీ నిర్ణీత రుసుము చెల్లించాలి. అయితే మనం షాపులోకొనే ధర కి ఈ కిండిల్ ధరకి తేడా ఏమీ లేదు. కొన్ని పుస్తకాలు బయటికంటే తక్కువ ధర కి లభ్యం. అలాగే మనం షాపు కి వెళ్ళినప్పుడు మనకి తెలియని పుస్తకమైతె కొన్ని పేజీలు అలా తిరగేసి మనకి నచ్చితే కొంటాం. అలానే ఇందులో కూడా మొదటి చాప్టర్ ఉచితంగా చదువుకోవచ్చు. అది నచ్చితేనే కొనుక్కోవచ్చు. సరే, మరీ ఎక్కువ చెపితే మీరు నన్ను అమెజాన్ తాలూకు సేల్స్ మెన్ అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఇంతటితో ముగిస్తాను. మరిన్ని వివరాలకు అమెజాన్ వారి సైటు చూడండి.


మర్చేపోయాను, పుస్తకాల లాగా "కిండిల్ ఎడిషన్" బ్లాగులు కూడ ఉన్నాయి మరి. ఇంకేంటి, అందులో మీకు నచ్చిన బ్లాగులుంటే ఇక కంప్యూటరు తో పని లేదు ముఖ్యం గా ప్రయాణ సమయాల్లో.అలానే కిండల్ న్యూస్ పేపర్లు కూడా...

( నేను పైనున్న చిత్రాలను అమెజాన్ వారి సైటు నుంచి తీసుకున్నాను)

9 comments:

జీడిపప్పు said...

మంచి వ్యాసం. నాకు కిండిల్ పైన చాలా ఆశలు, కలలు ఉన్నాయి. నిన్ననే "బ్లాగర్లకు/రచయితలకు వరమా?" అని భవిష్యత్తులో కిండిల్ ఉపయోగాల గురించి రాద్దామనుకొన్నాను. ఆ వ్యాసానికి మీ ఈ వ్యాసం పరిచయంగా సరిపోతుంది.

ఉమాశంకర్ said...

జీడిపప్పు గారు.

మీ వ్యాఖ్య కి ధన్యవాదాలు.

నాక్కూడా. అందుకే కొందామనుకుంటూన్నాను,చూడాలి ..

మీ టపా రాసేయండి మరి....

ప్రపుల్ల చంద్ర said...

మంచి వ్యాసాన్ని అందించారు. ఇప్పటి సెల్ ఫోన్ల లాగా భవిష్యత్తులో ఇది అందరికి అందుబాటులోకి వస్తుందని ఆశిద్దాం..

ఉమాశంకర్ said...

ప్రపుల్ల చంద్ర గారు,

Thank you

చాలా రోజుల తరువాత కనిపించారు.. :) నేనయితే బయట ఎక్కడా చూడలేదు గాని మార్కెట్ నిపుణుల ఊహ ప్రకారం ఈ పరికరం ఊపందుకోవచ్చు...

మురళి said...

చాలారోజుల క్రితం కిండిల్ గురించి చదివా..మళ్ళీ ఇప్పుడు మీ వ్యాసం ద్వారా.. చాలా బాగా రాశారు. సేల్స్ పర్సన్ అని అస్సలు అనుకోము :) కిండిల్ వస్తే పుస్తకాలు నలిగిపోతాయనే బెంగ ఉండదు కూడా.

ఉమాశంకర్ said...

మురళి గారు:
ధన్యవాదాలు.
అవును, చూస్తుంటే బానే ఉండేట్టుంది. ప్రస్తుత వెర్షను కిండిల్2 మార్కెట్ లో కి రాగానే ఒకసారి చూడాలి దాన్ని..

సిరిసిరిమువ్వ said...

చాలా బాగా వివరించారు. ఇది ఇండియన్ మార్కెట్లోకి అందులోనూ తెలుగు భాషకి అనువుగా ఎప్పుడొస్తుందో?

ఉమాశంకర్ said...

@సిరిసిరిమువ్వ గారు:

ధన్యవాదాలు.

ఇది అమెరికా లోనే ఇంకా ప్రాచుర్యం పొందలేదండీ.. చూద్దాం .. దీనిగురించి తెలుసుకోగానే నాకు కలిగిన ఆలోచన కూడా అదే...

నరహరి said...

నాకు సోనీ బెటర్ అనిపిస్తుంది, మెమొరి లో పిడిఎఫ్ బుక్స్ చదువుకొవచ్చు

http://wiki.mobileread.com/wiki/E-book_Reader_Matrix

http://theory.isthereason.com/?p=1966

 
అనంతం - by Templates para novo blogger