మా ఇంటి కధ

Sunday, February 15, 2009

దాదాపు రెండేళ్ళుగా నా ప్రమేయం లేకుండా, దానంతటదే వాయిదా పడుతూ వస్తున్న పనొకటుంది. ఊళ్ళో ఉన్న మాఇంటిని పడేసి, తిరిగి కట్టించడం.దాదాపు ఇరవై యేళ్ళ క్రితమే మేము ఇంకొక ఇంటిని కట్టుకున్నా ,అది ఊరి సెంటర్లో ఉండటంవల్లా, ఆ వాహనాల దుమ్మూ, ధ్వని కాలుష్యాల కారణంగా తమకు నివాసయోగ్యం కాదని తేల్చేసారు మా ఇంట్లోవాళ్ళు. దాన్ని అద్దెకిచ్చి ఈ పాత ఇంట్లోనే ఉండటానికి మరొక ముఖ్యమైన కారణం దాదాపు ముప్పైయేళ్ళపైబడిన ఇరుగు-పొరుగు పరిచయాలు.

నిజానికా ఇంటిని మాతాత దాదాపు అరవై యేళ్ళ క్రితం కట్టించాడట. ఒక గది, దాన్నానుకొని ఒక వంటగది. వెనకనున్న ఖాళీ జాగాలో స్నానాదులకోసం ఒక బాత్రుం.ఆ రోజుల్లోనే వాటిని 20 రోజుల వ్యవధిలో నిర్మించారట ఆ నెల్లూరు నుంచొచ్చిన కూలీలు. అదొక రికార్డు. నిజానికి వాళ్ళని మావూళ్ళొ ఎవరో మోతుబరి ఇల్లు కట్టించుకోవటానికి నెల్లూరు నుంచి పిలిపించాడట. వాళ్ళు ఆ పని పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం లో ఉండగా మా తాత కళ్ళబడటం, మంచి పనివారనే నమ్మకం కారణంగా, ఈయన వాళ్ళని కాళ్ళావేళ్ళా బ్రతిమాలి, ఒప్పించి, ఈ ఇల్లు కట్టించడం. పని సగంలో ఉండగా వాళ్ళకి వాళ్ళ ఊరిమీద, ఇంట్లోవారి మీద గుబులు పుట్టినా, పని ఒప్పుకొని మాట ఇచ్చాక మాట తప్పేరోజులు కాకపోవటం వల్ల ,పాపం అందరూ రోజూ దాదాపు 18 గంటలు కష్టపడ్డారట. పొద్దున్నే నాలుగింటికి పని మొదలెట్టి, గుడ్డివెలుతురైనా రాత్రి దాదాపు పదింటి వరకూ పనిచేసేవారట. ఇప్పటికీ ఇంటి మధ్యగదులు రెండూ చాలాపటిష్టం గా ఉంటాయి. కాలక్రమేణా మా నాన్న ముందున్న ఖాలీ జాగాలో పంచ కట్టించి, మధ్యగదినానుకొని వారగా ఇంకొక గది కట్టించి, మేడ మీదికి మెట్లూ, మరికొన్ని మార్పులు చేర్పులూ చేసి ఇంటికి ప్రస్తుతమున్న రూపు తీసుకురావటం జరిగింది. అయితే ఈ మార్పులన్నీ ఇంతకు ముందున్న ఇంటికి అతుకులే కాబట్టి, కాలక్రమేణా ఆ అతుకులు బలహీనపడి, ఎప్పుడైనా విపరీతంగా వర్షం కురిస్తే ఇల్లు కురవడం ప్రారంభించింది. కొత్త ఇంటికి మారడం కుదరదని నిశ్చయమయ్యాక ఈ ఇంటిని మొత్తం పడగొట్టి తిరిగి కట్టించడం గురించి మా నాన్న నాకు స్పష్టం చెయ్యడం జరిగింది.

నిజానికి నేను ఆ ఇంటినీ నన్నూ ఎప్పుడూ వేరు చేసుకొని చూడలేదు. అందువల్ల ఒక సంవత్సర క్రితం ఇండియా వెళ్ళినప్పుడు, చేయాల్సిన పనిని దృష్టిలో పెట్టుకొని ఇళ్ళంతా ఒకసారి పరికించి చూసుకుంటే, మనసంతా ఏదో అలజడి. ఎన్ని జ్ఞాపకాలూ! ఒకటా రెండా? నేను నడక నేర్చిన బండలూ, నేను పుట్టినప్పటి నుంచి నా ఎదుగుదలకి సాక్షీభూతాలయిన ఆ గదులూ,గోడలూ, భగవంతుడనేవాడు నాకు పరిచయమైన పూజగది, చిన్నప్పడు మేమాడుకున్న ఎన్నో ఆటలకి వేదికైన మిద్దె.... ఇవన్నీ నాకు పరిచయం లేని కొత్తరూపు సంతరించుకుకోవడానికి నామనసొప్పుకోవడంలేదు. రాత్రి పడుకున్నా నిద్ర పట్టలేదు. గది పైకప్పూ, చూట్టూ ఉన్న నాలుగు గోడలూ, తలుపులూ, కిటికీలూ అన్నీ నన్ను నిలదీసి ప్రశ్నిస్తున్నట్లు ఏవేవో ఊహలు. తెలిసీ తెలిసీ జీవితంలో ఏదో ముఖ్యమైన దాన్ని కోల్పోబోతున్నట్టు తెలీని బాధ.

ఇంకో రెండురోజుల్లో హైదరాబాదు పయనం, అక్కడినుంచి ఒక వారంలో అమెరికాకి. ఇక ఇంటిని ఇలా చూడడం ఇదే ఆఖరు.బహుశా వేసవి లో పని మొదలు కావచ్చు. పని మొదలయ్యే సమయానికి నేను ఇక్కడుండక పోవటం ఒకరకం గా మంచిదే. నాముందే వాళ్ళు ఇల్లంతా కూలగొడుతుంటే చూడటం నావల్లయితే కాదు

పొద్దున లేచి, టిఫిన్ చేసాక నేను చేసిన మొట్టమొదటిపని నా హేండీకేం లొ ఇల్లంతా వీడియో తీయటం. బహుశా నేను ఆ కేమెరాని కొన్న కొత్తల్లో కూడా అంత శ్రద్దగా దేన్నీ వీడియో తీసుండను. మనసంతా ఏదో చెప్పలేని ఉద్విగ్నతకి లోను కావటం వల్ల నిశ్శబ్దం గా పని పూర్తి చేసాను, సౌండ్ మిక్సింగు తరువాత చేసుకోవచ్చులే అని.


ఇక నా హేండీకాం హడావిడి చూసి, ఆరోజు సాయంత్రం నా చెల్లాయి హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చినట్టు మా అమ్మని అడిగింది "అమ్మా చిన్నన్నయ్య ఈ ఇంట్లో పుట్టాడా లేక హాస్పిటల్లోనా?" అని. నిజానికి మానలుగురు పిల్లల్లో మా చెల్లాయొక్కతే హాస్పిటల్లో పుట్టింది.మేమంతా ఇంట్లోనే పుట్టాం. విషయంలోమా చిన్నప్పుడు చెల్లాయి నేను వాదులాడుకునే వాళ్ళం . తనేమో "నువ్వు ఇంట్లోనే పుట్టావు నేను హాస్పిటల్లో" అని మా గొప్పగా చెప్పుకునేది.నేను చిన్నబుచ్చుకోవటం ఇష్టం లేక మా అమ్మ నాతో "నువ్వు పుట్టింది కూడా హాస్పిటల్లోనేరా" అనేది. అలా అలా అది నాకొక సందేహంగా ఉన్నా, నేను దాన్ని ఎన్నడూ నివృత్తి చేసుకోలేదు. అయితే ఈసారి చెల్లాయి అడిగినదానికి నాకు అమ్మనుంచి కచ్చితమైన సమాధానం దొరికింది.

రోజూ రాత్రి రెండింటి దాకా టివీ చూసే అలవాటున్న నేను, ఆ రోజు పదింటికే టీవీ కట్టేసి, ఎన్నడూలేని విధంగా మధ్యగదిలో చెక్కబీరువా ముందు పక్కేసుకుంటుంటే వింతగా చూసింది మా అమ్మ.

9 comments:

మురళి said...

చాలా బాగుంది. అనుభవించే వాళ్ళకి మాత్రమే అర్ధమవుతుంది ఆ ఫీలింగ్. వీడియో ఉందికదా, చూడాలని అనిపించినప్పుడల్లా చూడొచ్చు. వీకెండ్లో తెల్లవారుజామునే లేచి బాల్య స్మృతుల్లోకి వెళ్లారన్న మాట..మా ఇల్లు, బాల్యం గుర్తొచ్చాయి.

subhadra said...

devudi ni parichayam chesi gadi,aatala midde akkada chuvvu tunteee chala bagaa anipinchindi.
yevaremma manaki sentimentss yekke(indians ki) .
mee post chaduvutuntee mee illu kulagodutunnaduku nake chala badestundi.
shot chesi manchi pani cheseru.

పరిమళం said...

నిజమండీ !ఆ బాధ అనుభవిస్తేనే తెలుస్తుంది .నాకూ అది అనుభవమే !

చిలమకూరు విజయమోహన్ said...

కొన్నిసార్లు వ్యక్తులతోనే కాదు కట్టడాలతో కూడా అనుబంధం తెగిపోతుందంటే నిజంగా చాలా బాధగా ఉంటుంది.మీబాధను అర్థంచేసుకోగలం.

ఉమాశంకర్ said...

@ మురళి గారు,
అవునండి, ఎందుకో ఈ వీకెండ్లో "ఇంటి" మీదికి గాలి మళ్ళింది.
@సుభద్ర గారు:
మీ వ్యాఖ్య కి ధన్యవాదాలు. అవునండి మనకి కాస్త సెంటిమెంట్స్ ఎక్కువేనేమో..

@పరిమళం గారు,
మీ వ్యాఖ్య కి ధన్యవాదాలు ..మీ బ్లాగు చూసాను.. చాల బావుంది..

@ విజయ మోహన్ గారు:
మీ వ్యాఖ్య కి ధన్యవాదాలు ..ప్చ్ ఏం చేయగలం చెప్పండి?

మధుర వాణి said...

ఉమాశంకర్ గారూ..
చాలా రోజులైపోయిందండీ మీ బ్లాగు వైపొచ్చి :(
కొత్త టెంప్లేట్ బావుంది. పాతది కూడా బావున్నట్టు గుర్తు :)

మీ ఇంటి గురించి రాసిన టపా నన్ను కూడా మా ఇంటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళింది.
మేము వేరే ఊరులో ఉన్న ఇంటికి మారిపోవడం వల్ల, పల్లెటూర్లోని మా ఇంటిని అద్దెక్కి ఇచ్చారు ఎవరికో..
మేము వచ్చేసాక మళ్ళీ ఒకసారి ఆ ఇంటికి వెళ్లి చూసి అసలు ఒక్క క్షణం కూడా నిలబడలేకపోయాను.
అంతా మారిపోయింది. అసలు మా ఇల్లేనా ఇది అనిపించింది. ఏంటో.. చాలా బాధనిపించింది.
ఏదో కోల్పోయిన భావన వచ్చేసింది :(

మీరు రాసే విధానం మాత్రం పక్కనుండి కబుర్లు చెప్తున్నట్టుగా భలేగా ఉంటుందండీ :)

ఉమాశంకర్ said...

@ మధురవాణి గారు:
Thank you. :)
పుట్టి పెరిగిన ఊరూ, ఇల్లూ మర్చిపోగలమా? రూపు మారితే తట్టుకోగలమా? చాలా కష్టం.

భావన said...

ఉమా శంకర్ గారు,
బోలెడన్ని ధన్య వాదాలండి.. ఇన్ని మంచి జ్ఞాపకాలు ఎన్ని మంచి అనుభూతులను మా అందరితో పంచుకుంటూ జ్ఞాపకాల తేనె తుట్టె ను కదుపుతున్నందుకు... తేనెటీగల గిల్టీ కుట్టినప్పుడు చురుక్కుమన్నా జ్ఞాపాకల తేనెలు రుచి చూసే మాధుర్యం లో అంత నొప్పి వుండదు కదా.. ప్రతి దానికి కామెంట్ చెయ్యాలని వుంది కాని పాపం తెల్ల వారుజామున లేచి మళ్ళీ అన్నిటికి ఎక్కడ సమాధానం ఇస్తారులే అని జాలి పడి ఒక్క దానిలోనే అన్నిటికి కలిపి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అవును మల్లది గారి ది ఏదో పుస్తకం చదివి మేము కాలేజ్ లో ఆ రంగుల గురించి చెప్పుకునే వాళ్ళము. కౌముది లో మల్లది గారి పాత పుస్తకం అద్దెకిచ్చిన హ్రుదయాలు వస్తోంది www.koumudi.net లో చూడండి... ఈనాడు చదవటం అంటే ఆ కాగితాలంటే రెప రెప ల గురించి ఇంకో చిన్న మాట ఇండియా నుంచి చీర లు ఇస్త్రీ చేయించుకుని తెచ్చుకుంటే వాటి మద్య లో తెలుగు పేపర్ పెట్టి చేసేడు ఆ అబ్బాయి.... ఇక్కడకు వచ్చాక ఆ కాగితం కూడా అదో పెద్ద అధ్బుతం లా దాచి ఒకటికి రెండు సార్లు చదువుకుని పక్కన పెట్టే దాన్ని (నా చేతులతో పారెయ్యటానికి మళ్ళీ మనసు రాక)ఇప్పట్లో కాదు online edition రాక ముందు.. ఏమిటో ఆ సతికేసే పిచ్చి... బోలెడన్ని ధన్య వాదాలతో శెలవు..

ఉమాశంకర్ said...

భావన గారు,

నే రాసినవన్నీ ఓపిగ్గా చదివి ఇంత మంచి వ్యాఖ్య రాసినందుకు మీక్కూడా బోలెడన్ని ధన్యవాదాలు.

మల్లాది నవల సావిరహే" గురించే అనుకుంటా మీరంటున్నది...

ఈనాడు పేపర్ గురించి: నేను కూడా అలానే ఫీలవుతాను అనుకుంటున్నాను. చూస్తూ చూస్తూ పారేయటానికి చేతులు రావు..

 
అనంతం - by Templates para novo blogger