నా వానా కాలం చదువు

Monday, November 24, 2008

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సాగిన నా పఠనా ప్రస్థానాన్ని అక్షరబద్దం చేద్దామనే ఆలోచన ఈ టపా కి ప్రేరణ. ఇది రాస్తున్నంత సేపూ నాకని పిస్తూనే ఉంది ఇది సమగ్రమైన టపా కాక పోవచ్చు అని.కొన్నేమో లీలగా గుర్తున్నాయ్, మరి కొన్ని గుర్తుకు వచ్చినప్పుడు ఆ ఒక్క విషయానే ఒక పెద్ద టపా లా రాయొచ్చు అనిపించేది. ఇక్కడ కుదించి రాసి రెంటికీ చెడ్డ రేవడి లా అవుతున్నదేమో అన్న అసంతృప్తి.దానికితోడు అభిరుచి కొద్దీ నేను చేసిన జర్నలిజం కోర్సు లో నేర్చుకున్న "క్లుప్తత" పాఠం, నన్ను పేజీ లకు పేజీలు రాయనివ్వలేదు. వెరసి ఇదిలా తయారైంది.
************************************************************

మొత్తం మీద చూస్తే నేనేమి పెద్దగా ఏమీ చదూకోలేదు అనిపిస్తుంది నాకు.స్కూలో ఉన్నప్పుడు,కాలేజీ లో ఉన్నప్పుడు ఎడా పెడా చదివి పారేసినా ఉద్యోగపర్వం లోకి వచ్చాక పెద్దగా చదివింది అంతగా లేదు.అదే నాకు కొద్దిగా బాధ కలిగించే విషయం.ఈ పన్నెండేళ్ళలో ఎన్ని వేల గంటల్ని వృధా చేసానో అనిపిస్తుంది నాకు.సద్వినియోగం చేసుకొని ఉంటే ఇంకొన్ని పుస్తకాలు నేను చదివిన లిస్టు లోకి చేరి ఉండేవి కదా.ఏమాట కామాటే చెప్పూకోవాలి నా ఉద్యోగజీవితం మొదలైన కొత్తల్లో పని పరమైన ఒత్తిడి విపరీతంగా ఉండేది. మిగతావారి కంటే వెనక పడ కూడదనే గట్టి పట్టుదలా, ఆ మొదటి నాలుగేళ్ళూ నా సాంకేతిక జ్ఞానాన్ని వృద్ధి పరచుకోవాల్సిన ఆవశ్యకతా, నన్ను నాకిష్టమైన పనికి దూరం చేసాయి. మనకిష్టమైన పనిని ఎన్ని ఇబ్బందులొచ్చినా కొనసాగించటం లోనే గొప్పతనం దాగుంటుంది. నేను మాత్రం ఆ విషయం లో పెద్ద ఫెయిల్యూర్.

నాకు ఊహ తెలిసి నేను చదివిన మొదటి పుస్తకం చందమామ.ఆ తరువాత బాలజ్యోతి,బాలమిత్ర,జాబిల్లి. వీటివల్లనేమో నాకు జానపద చిత్రాలంటే విపరీతమైన ఆసక్తి ఏర్పడింది.నా చిన్నప్పుడు నేను జానపద చిత్రాల్ని విపరీతంగా చూసేవాడిని. పొద్దున్నే స్కూలు కి వెళ్ళేటప్పుడు ఎన్.టి.రామారావు గారి ఏ "అగ్గి పిడుగో", లేక కాంతా రావు గారి "జ్వాలా ద్వీప రహస్యం" తాలూకు వాల్ పోస్టర్ కనపడిందంటే ఇక మనసంతా ఒకటే ఆలోచన, ఈ సినిమా చూసే వీలు ఎప్పుడూ కలుగుతుందా అని.ఇప్పుడంటే రెండు ఫోన్ నంబర్లు గుర్తుపెట్టు కోవాలంటే బుర్ర కి కొద్దిగా కష్టమవుతుంది గాని చిన్నపుడు నేను ఏకసంధా గ్రాహిని.బాగా చదువుతాననే పేరుండటం చేత ఇంట్లో కూడా నా సినిమా పిచ్చి కి పెద్ద అడ్డుండేది కాదు. అమ్మ దగ్గర ఒక రూపాయుచ్చుకుంటే సినిమా టిక్కెట్టు తోపాటు ఇంటర్వెల్ లో ఉడకబెట్టిన వేరుశెనక్కాయలు కూడా నా వళ్ళో పడేవి(నావన్నీ నేల టిక్కెట్టు సినిమాలు లెండి).సరే విషయం పక్క దారి పడుతోందనుకుంటా. నా చదువు గోల కాస్తా సినిమా గోల గా మారకముందే దీన్ని ఆపేస్తా.ఆ రోజుల్లో చిన్న చిన్న పాకెట్ సైజు జానపద కధల పుస్తకాలు ఉండేవి.నాదగ్గరున్న ట్రంకు పెట్టెలో దాదాపు ఒక వంద పుస్తకాలుండేవి అట్లాంటివి.అప్పట్లో అవి నాప్రాణం.పాఠ్య పుస్తకాలకుక్కూడా అంత సీనుండేది కాదు వాటిముందు.వాటిని పాన్ షాపుల్లో క్లిప్పులతో ఒక దడి లాగా కట్టి వేలాడదీసి అమ్మేవారు.అట్టమీద బొమ్మ, కధ పేరు కాస్త ఆసక్తికరంగా కనపడిందంటే చాలు ఆ పుస్తకాన్ని కర కరా నమిలి మింగాల్సిందే. లేకుంటే మనసులో చెప్పలేనంత దిగులు.

నాకు ఈనాడు పేపరు చదవటం నా పదోయేటే అలవాటైంది. అతిశయోక్తి అనుకోకుంటే ఒక్క మాట.నా ఈనాడు పఠనం అప్పటినుండి ఇప్పటిదాకా అప్రతిహతం గా కొనసాగుతూనే ఉంది.నేను చదవనిదల్లా పండగలప్పుడు "పండగ సందర్భం గా ఈనాడు కార్యాలయానికి సెలవు"అని వారు సెలవిచ్చినప్పుడే. అప్పటినుంచి ఇప్పటివరకు నేను "ఈనాడు" వీరాభిమానిని(ఈ కుళ్ళు రాజకీయాలని పక్క పెడితే). నా ఆరోతరగతిలో యేసురత్నం గారని సోషల్ టీచరొకరుండేవారు. ఆయన ఆరోజుల్లోనే మాకు డైరీ రాయటం నేర్పించారు. రోజూ ఆయన క్లాసులో మేము క్రితం రోజు రాసిన మా దిన చర్య చూపించాలి. దానితో పాటు ఆరోజు పేపర్లో వచ్చిన ముఖ్యమైనా వార్తలు కూడా రాయాలి. అలా ఒకానొక శుభదినాన నా "ఈనాడు" పఠనం మొదలయింది. నా ఆనాటి దినచర్యలో మొదటి మూడు వాక్యాలు ప్రతిరోజూ ఒకేలా ఉండేవి ఇలా..

"ఈరోజు నేను పొద్దున్నే ఏడుగంటలకు నిద్ర లేచితిని. ఆ వెంటనే పళ్ళుతోమితిని. అటుపిమ్మట కాలకృత్యములు తీర్చుకొని కాసేపు చదువుకొంటిని".

నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఆ డైరీ అనుకోకుండా నా కంట పడితే ఒక రోజంతా నవ్వుకున్నా మళ్ళీ మళ్ళీ చదువుకొని.
అప్పుడు నేనుచదివిన ఈనాడు లో నాకిప్పటికీ గుర్తున్న వార్తలు కొన్నున్నాయ్. అవి , రష్యా అధ్యక్షుడు అంద్రోప్రొవ్ మరణం, ఎయిర్ ఇండియా విమానం కనిష్క కూల్చివేత, బందిపోటు రాణి పూలన్ దేవి లొంగుబాటు, మహా కవి శ్రీ శ్రీ మరణం. ఇంకా ఆలోచిస్తే మరికొన్ని గుర్తొస్తాయి గానీ, నాకే అనిపిస్తొంది ఇక్కడ రాయటం అంత అవసరమా అని. మరి చదివే వారు మీకేమనిపించొచ్చో నాకుతెలుసు. సరే, పేపరు నాచేతికి రాగానే మొదట నేను చదివేది మూడో పేజీ లో కుడివైపు కింద భాగం లో ఉండే బొమ్మల కధ. ఒక రెండేళ్ళ పాటు వీటిని కట్ చేసి పుస్తకంగా కుట్టుకున్నాను కూడా. తరువాత క్రీడా వార్తలు, మొదటిపేజీ వార్తలు. కాస్త బుర్ర పెరిగాక మూడో పేజి సంపాదకీయాలూ, కులదీప్ నయ్యరు (లోగుట్టు), ఎ.జి. నూరానీ, చంద్రచూడ్ సింగ్ లాంటీ మహా మహుల వ్యాసాలూ , పుణ్యభూమీ, చలసాని కబుర్లూ వగైరా వగైరా.

ఎప్పుడు , ఎందుకు చదివానో నాకు తెలీదు గానీ నేను నా జీవితంలో చదివిన మొట్టమొదటి నవల మల్లాది వారి "మేఘమాల". నా అదృష్టమేమో నా మొట్టమొదటి నవలే మల్లాది ది కావటం. నాకానవల విపరీతంగా నచ్చింది. ఇంకేముంది జబ్బు ముదిరింది నాకు. దొరికిన నవల్నల్లా చదివి పారెయ్యటమే.దానికి తోడు మా అన్నయ్య ఫ్రెండొకతనికి అద్దె పుస్తకాల షాపుండేది. మల్లాది,యండమూరి, సూర్యదేవర, చందు సోంబాబు,అల్లాణి శ్రీధర్,యర్రంశెట్టి ఒకరేమిటి, పేరున్న, పేరు లేని, పేరుండి ఆ తరువాత పిచ్చి రాతలు రాసి పేరు చెడగొట్టుకున్న వారందరి నవళ్ళూ చదివేసా. మల్లాది కి వీరాభిమానిని కదా ఆయన రూపాయి పత్రిక స్రవంతి నీ పోషించా అదున్నన్నాళ్ళూ. నాకు బాగా నచ్చిన నవలలు బోలెడున్నాయ్ అన్నీ గుర్తు కు రావు గానీ, యండమూరి ఆనందో బ్రహ్మ, ప్రార్ధన, వెన్నెల్లో ఆడపిల్ల, మల్లాది మేఘమాల, సావిరహే,అందమైన జీవితం,మందాకిని వాటిలో కొన్ని. నాకు మల్లాది రాసిన వాటిల్లొ నచ్చని దంటే ఏకలింగం అడ్వెంచర్స్. ఆ తరువాత ఆయన రాసిన రచనల్లో శృంగారం పాళ్ళు ఎక్కువ ఉండటం కూడా నాకు నచ్చలేదు. మొత్తానికి ఆ టైంలో నాకు బాగా నచ్చిన రచయితలంటే వారిద్దరే , మల్లాది, యండమూరి.

మల్లాది నవలల్లో హైదరాబాదు ప్రస్తావన దాదాపు అన్ని నవలల్లో కనపడేది.అప్పట్లో సావిరహే చదివి నేను డంగైపోయాను.నేను కూడా హైదరాబాదు వెళ్ళి అర్జంటుగా ఒక అందమైన అమ్మాయిని ప్రేమించి షికార్లు కొడుతున్నట్ట్లు ఊహల్లో తేలిపోయేవాడిని. ఛీ ఇంకా ఎన్నాళ్ళీ పేట జీవితం, హైదరాబాదు ఎప్పుడెల్తాను అనిపించేది నాకు. అందుకే నాకు ఇంజనీరింగు సీటు హైదరాబాదు లో వస్తే, సీటు వచ్చినందుకంటే, హైదరాబాదు వెళ్తున్నందుకు చాలా సంతోషం వేసింది నాకు.

అందరికీ తెలిసిన విషయమే అనుకుంటా, మల్లాది గారి కో నియమం ఉండేది. ఆయన రాసే ప్రతి నవల లో పాత్రల పేర్లు ఏవీ కూడా రిపీట్ కాకూడదు. అంటే అంతకుముందు తను రాసిన ఏ నవల్లోను పెట్టని పేర్లై ఉండాలి. అందుకే ఆయన రచనల్లో కొన్ని పాత్రల పేరు చాలా విచిత్రం గా ఉండేవి. ఆ పేర్లు ఆ పాత్ర స్వభావాన్ని, వయసునీ దృష్టిలో పెట్టుకొని ఎన్నుకున్నట్టే ఉంటుంది కానీ , అసహజం గా ఏమాత్రం ఉండేవి కావు. యండమూరి లా భావుకత ని పండించక పోయినా, చాలా సింపుల్ గా, ఒక సన్నివేశం తరువాత మరొక సన్నివేశం , అలా అలా .. నవలంతా కళ్ళముందు జరిగిపోతున్న సినిమాలా ఉండేదే తప్ప, ఒక నవల చదువుతున్నట్టు ఏమాత్రం ఉండేది కాదు నాకు. నాకు డైరీ రాసే అలవాటున్నప్పుడు, ఏదో ఒక డైరీ వెనక పేజీ లో మల్లాది పాత్రల పేర్లు అని హెడ్డింగు పెట్టి నాకు గుర్తున్న పేర్లన్నీ రాసినట్టు గుర్తు. యెర్రంశెట్టి హాస్యం అన్నా నాకు చాలా ఇష్టం. ఆయన ఒక కాలనీ ని ఆధారంగా చేసుకొని రాసిన కధలు చాలా బావుండేవి(అది నిర్భయ్ నగర్ కాలనీ నేనా?). శాయి గారు అంతకుముందు సీరియస్ గా ఉండే రచనలు చేసారనుకుంటా. కార్నర్ సీట్ అని ఒక చిన్న నవల ఈయనదే చదివినట్టు గుర్తు.(రచయిత ఆయన కాకపోతే సరిదిద్దండేం?).

వార , మాస పత్రికలూ తెగ చదివేవాడిని. నాకు గుర్తుండి నేను చదివిన మొట్టమొదటి కధ "ప్రిస్టేజ్" అని అంధ్ర సచిత్ర వార పత్రిక లోనిది. నవలలు ఎంత ఇష్టం గా చదివేవాడినో పత్రికల్లో కధలు కూడా అంతే ఇష్టం గా చదివేవాడిని. ఇప్పుడెలా ఉందో తెలీదు ,చదవటం మానేసాను గాని,అప్పట్లో నా అభిమాన వార పత్రిక అంటే అంధ్రభూమి. కొన్న రెండు గంటల్లో మొత్తం చదివిపారేసి నిట్టూర్చేవాడిని అప్పుడే అయిపోయిందే అని. మొత్తం చదివేయక పోతే ఒక రెండు కధలో సీరియల్సో రేపటికి మిగుల్చుకుంటే బాగుండేది కదా అనుకొనేవాడిని. ఆతర్వాత కొన్ని సంవత్సరాలకు అదే ఆంధ్రభూమి కారణంగా నాకు కధల మీద ఆసక్తి పోయింది. ప్రతిభ ఏమాత్రం లేని కొత్త రచయితల కధలు ప్రచురిత మవటం ప్రారంభమయింది. కొన్ని కధలైతే అసలిది కధేనా అనిపించేటంత. డబ్బులిచ్చి వేయించు కున్నట్లుంది అనే కొన్ని వాఖ్యలు వినపడినా నాకైతే అందులో నిజమెంతుందో తెలీదు. ఆ రోజుల్లో నేను క్రమం తప్పకుండా చదివిన మరికొన్ని పత్రికలు అంటే అంధ్ర జ్యోతి, అంధ్ర ప్రభ, రచన,మిసిమి ( ఇందులో కొన్ని వ్యాసాల స్థాయి ఎలా ఉంటుందంటే నాకసలు అర్ధమయేవి కావు, బహుశా యిప్పటికీ కూడా). ఇంకా మరికొన్ని ఉండేవి గాని పేర్లు గుర్తు రావటం లేదు. సినిమా పత్రికల్లో సితార, జ్యోతిచిత్ర క్రమం తప్పకుండా చదివేవాడిని. మహానటి సావిత్రి చనిపోయినప్పుడు "రాలిపోయిన తార" అని హెడ్డింగు పెట్టి రాసారు జ్యోతిచిత్రలో(అనుకుంటా). అప్పటికి నేనింకా చాలా చిన్నపిల్లోడిని, నాకు సావిత్రి తెలీదు. అందరూ "అయ్యో" అంటూ చదువుతుంటే, నేను యధాలాపంగా ఆపేజీ చూసానంతే.

ఈనాడు ఆదివారం సంచికలో వచ్చే కధ అంటే నాకు చాలా క్రేజ్. నేను ఇంజనీరింగు చదివే రోజుల్లో నేను సైతం అని ఒక కధ రాసి ఈనాడు లో పనిచేసే మా పిన్ని ద్వారా పంపిస్తే చలసాని వారు బహు మర్యాదగా దాన్ని తిప్పి పంపిం"చేరు". దాంతో మా పిన్ని అప్పటి అంధ్ర ప్రభ ఏడిటర్ గా ఉన్న వాకాటి వారి వద్దకి పంపిస్తా, వెళ్ళి, మాట్లాడి, రాయడం లో కొన్ని కిటుకులు తెలుసుకోమంటే, కధ రిజక్ట్ అయిన బాధలో నేను ఆమెతో "ఊ" అన్నా, నాతోనేను "ఊహూ" అనుకొని బయటకొచ్చేసాను. అప్పటి కధని కొన్నేళ్ళ తరువాత తిరిగి చదువుకుంటే , ఆ రోజు వాకాటి వారి వద్దకు వెళ్ళకుండా మంచి పని చేసాననిపించింది. పెద్దమనిషి కర్రుచ్చుకొని వెంటపడిఉండేవారు. దాదాపు ఒక నాలుగైదు యేళ్ళపాటు ఈనాడు ఆదివారం సంచిక లో వచ్చే కధలన్నీ చింపి ఒక చిన్న పుస్తకం లా కుట్టుకున్నాను. కొన్ని కధలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే అసలు మాటల్లో చెప్పలేను. ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు దుమ్ము దులిపి ఒక లుక్కేయాలి దానిమీద.

ఇంజనీరింగు లోకొచ్చాక కూడా మొదటి మూడేళ్ళు బానే చదివాననుకుంటా. అప్పట్లో నేను స్టేట్ సెంట్రల్ లైబ్రరీ కి వెళ్ళేవాడిని రెగ్యులర్ గా. మా కాలేజేమో గండిపేట్లో.లైబ్రరీ ఏమో అఫ్జల్ గంజ్ లో. శనాదివారాలు పొద్దునే బయలుదేరి లైబ్రరీ కి వచ్చేవాడిని. వచ్చేసరికి ఎంతలేదన్నా పదీ పదకొండయ్యేది, ఒక గంట చదవగానే ఆకలి. ఇంకొక రెండు గంటలు కాగానే ఇంక బయల్దేరాలీ అనే తొందర. ఇంట్లో డబ్బులమీద ఆధార పడ్డ ఆరోజుల్లో హాస్టల్ లంచ్ త్యాగం చేసి బయటతినాలంటే కొద్దిగా ఆలొచించాల్సొచ్చేది.అలా అక్కడ నాకు తిలక్,బలివాడ,శీలా వీర్రాజు,కొ.కు,రంగ నాయకమ్మ, అక్కిరాజు (మంజు శ్రీ),భరాగో, ఇంకా చాలా మంది పరిచమయ్యారు. ముఖ్యం గా కొ.కు గారు. ఆయన రచనలు చదుతుంటే , చదువుతున్నత సేపూ కోపం వచ్చేది నామీద నాకే. ఈయన రచనలు నా దృష్టి కి మరీ ఇంత లేటు గా వచ్చాయేమిటి అని. రంగనాయకమ్మ గారి రచనలు చదివాక నాకు అప్పటివరకు ఉండే ఆలోచనల్లో సమూలమైన మార్పు వచ్చింది. "బడు" పద ప్రయోగం మీద, "వాడుక భాష" గురించి ఆమె రాసిన వ్యాసాలు చాలా ఆసక్తి గా చదివాను.ఆ తరువాత నా మకాం చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ కి మార్చాను.అప్పటి తిరుగుడు అంతా సిటీ బస్సుల్లోనే కదా. ఈ లైబ్రరీ ఎలా ఉండేదంటే ఎటువైపు బస్సు దిగినా బాగా లోపలికి నడవాలి. దానికి తోడు ఆరూట్లో బస్సులు తక్కువ. ఇంత కష్టపడ్డా ఇక్కడేమి చదివానో గుర్తు లేదు గాని, రిఫరెన్సు విభాగంలో పదిహేను ఇరవైయేళ్ళ నాటి "ఈనాడు" పేపర్లు నెలలవారీగా బైండు కట్టి ఉండేవి, వాటిని తెగ చదివేవాడిని. ముఖ్యంగా ఆదివారం నాటి పేపర్లని.

నాకు ఊహ తెలిసి నేను చదివిన మొదటి సాహితీ కాలం "చేరాతలు". ఆ తరువాత ఏపేపరు చదివినా సాహిత్యానికి సంబంధించిన పేజీ లని శ్రద్ద గా చదివేవాడిని. ఇప్పటికీ నాకు కొన్ని అర్ధం కావు. అందుకే నా స్థాయి మీద నాకెప్పుడూ న్యూనతా భావమే. ఇంకొంచెం ఎక్కువ చదివి ఉండాల్సింది అనే ఆలోచనే..

పెళ్ళి చేసుకొని మొదటి సారి ఇక్కడికి వచ్చినప్పుడు అనుకున్నా, నాలుగు సూట్కేసులు గదా, ఈసారి ఇండియా వెళ్ళినప్పుడూ ఒక సూట్కేసు నిండా నాకు నచ్చిన పుస్తకాలు కొనుక్కొని తెచ్చుకోవాలి అని. అలానే ఒకరొజు మా ఆవిడ కళ్ళుగప్పి అబిడ్స్ విశాలాంధ్ర బుక్ హవుసు కెళ్ళి నాకు నచ్చిన పుస్తకాలు చాలా కొన్నా. నండూరి వారి విశ్వదర్శనం రెండు సంపుటాలు, తిలక్ కధలు, మునిపల్లె రాజు జర్నలిజం లో సృజనరాగాలు, అక్కిరాజు గారి సాహితీ వ్యాసంగం, భరాగొ ఇట్లు మీ విధేయుడు, నవీన్ అంపశయ్య, డి.వి నరసరాజు గారి ఆత్మ కధ, మహానటి సావిత్రి జీవిత చరిత్ర, భానుమతి గారి నాలో నేను.. మరికొన్ని. ఇంటి కొచ్చాక వాటన్నిటినీ తూకం వేస్తే గుండే గుభేలు మంది. నిజంగానే ఒక సూటుకేసు కి అవే సరిపోతాయ్. అవన్నీ ఒక సూటుకేసు లో సర్ది, పైన బట్టలు పెట్టా అనుమానం రాకుండా. "రాజభవనం అంతా తిరుగు, ఆ గది తలుపు మాత్రం తియ్యకు" అని అదేదో జానపద కధలో రాకుమారిడికి చెప్పినట్లు నేను తనకి చెప్పాను, ఆ సూట్కేసు తీయకు అందులో ఉన్నవన్నీ చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్లు, అవి గనక పోతే ఇక అంతే సంగతులు అని. ఇంకా నమ్మకం కుదరక ఆ సూట్కేసు ని మా బెడ్రూం మంచం కింద లోపలికి అందకుండా తోసేసా. మొతానికి కధ సుఖాంతమే అయింది "నేను అమెరికా వచ్చేదాకా". ఆమాత్రం రిస్కు తీసుకోకపోతే నాకు మిగిలేది ఇంకో రెండు శిల్పారామం , తరుణి షాపింగులూ , ఇంకో రెండు రకాల పచ్చళ్ళు, మరి కొన్ని తపేలాలూ, గిన్నెలూనూ . ఇంట్లో ఇప్పటికీ తను గుర్రు గా చూస్తుంది ఆ పుస్తకాల వంక.

నాకు బాగా తెలుసు నాదంతా వానాకాలం చదువే అని. ఇక్కడికొచ్చేక ఆ మాత్రం చదువు కూడా లేదు. ఎలాగైనా రెండో ఇన్నింగ్స్ మొదలేట్టాలి. అన్నిటికంటే ముందు ఇప్పటివరకూ చదివిన సిలబస్ ని ఇంకోసారి తిరగెయ్యాలి..

14 comments:

ఏడుకొండలు said...

ఉమాశంకర్ గారు, గతాన్ని గుర్తు చేసారు, దన్యవాదాలు. నెను మీ అన్ని పుస్తకాలు చడివి ఉండకపోయినా, చేతికి అందిన ఏ పుస్తకం అయినా పూర్తి చెయ్యనిదే నిద్రపట్టేది కాదు. అలానే ఈనాడు పేపర్, ప్రజశక్తి (పెద్దగా చదవదగ్గ వార్తలు ఉండేవి కాదు, ఎవరెవరు ఎంత చందాలు ఇచ్చారు అని తప్పితే. వాటిని చదవడం ఒక సరదా)

కొత్త పాళీ said...

బావుంది మీ పఠన ప్రస్థానం. మీరు ఇంకా అమెరికాలోనే నివాసం ఉన్నారు అనుకుంటాను. రెందు ఉచిత సలహాలు.
1. మీరెప్పుడు ఇండీయాలో పుస్తకాలు కొన్నా వాటిని ఇక్కడికి సుబ్బరంగా సీమెయిల్లో పంపించుకోవచ్చు, మీ సూట్కేసులు నిండిపోకుండానూ, మీ సతీమణిగుర్రు గా చూడకుండానూ. ఈ మధ్య రేట్లు పెరిగాయని విన్నాను. ఐనాకూడా ఇది మంచి చౌక పద్ధతే.
2. మీరు ఇండియా వెళ్ళను కూడా అక్కర్లేదు పుస్తకాలు కావాలంటే. నవోదయ రామ్మోహనరావుగారికి మీక్కావలసిన పుస్తకాల జాబితా ఈమెయిలు కొడితే వారే పైన చెప్పిన పద్ధతిలో పార్సిలు చేస్తారు.

ఉమాశంకర్ said...

@ఏడుకొండలుగారు:

మీవ్యాఖ్య కి ధన్యవాదాలు. ప్రజాశక్తి నేనూ చూసాను మా ఊరి శాఖా గ్రంధాలయంలో. మిగతా పేపర్లు తో పోలిస్తే అది బాగా బక్క చిక్కి ఉండెది, ఎనిమిదో, పదో పేజీలతో...

@కొత్తపాళీగారు:

ఇదేదో బానేఉందే.నాకు వారి ఈ-మెయిలు ఇవ్వగలరా?

మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

durgeswara said...

ఈజబ్బు నాకూవుది. చిన్నప్పటినుంచి కనపడినదల్లా చదివెయ్యటమ్.మీపూర్తి పేరు రామరాజు ఉమాశంకరా?

ఉమాశంకర్ said...

దుర్గేశ్వర గారు,

లేదండి. నా పేరు యస్.ఉమాశంకర రావు

సుజాత said...

బాగుంది. నా చిన్నప్పటి రోజులు కూడా గుర్తు తెచ్చారు. మీ జ్ఞాపక శక్తి అమోఘమని చెప్పక తప్పదు. న్యూస్ ఐటంస్ హెడ్డింగ్స్ కూడా గుర్తు పెట్టుకున్నారంటే!మంజుశ్రీ గారిని (శ్రీగిరి రాజు రంగారావు గారని వారి బంధువులు..న్యాయవాది, ఉండేవారుమా అమ్మమ్మ వాళ్ళ ఎదురిల్లే...!) నరసరావు పేటలో చూశాను, కానీ అప్పుడు అసలు ఊహ తెలియని వయసు. "ఆయనే మంజుశ్రీ " అని ఇంట్లో అనుకుంటుంటే "అదేమిటి, ఎంచక్కా మగ పేరు పెట్టుకోవచ్చుగా" అనుకునే దాన్ని.

ఉమాశంకర్ said...

సుజాత గారు,

టపా ఓపిగ్గా చదివి వ్యాఖ్యా నించినందుకు ధన్యవాదాలు.

ఎందుకో అవి అలా గుర్తుండిపోయాయంతే.తెల్లవారుఝామున లేచి టపా రాస్తున్నప్పుడు అవి ఒకదాని తరువాత ఇంకొకటి, అలా మరికొన్ని, గుర్తుకు వస్తూ ఉంటే నాకే కొద్దిగా ఆశ్చర్యం వేసింది.

GIREESH K. said...

ఈనాడు పేపరూ, కనిష్క విమానం కూల్చివేత, పాకెట్ సైజు జానపద కథలపుస్తకాలు, ఆదివారం ఈనాడు కథలు, యండమూరి నవల్సు, మల్లాది సావిరహే, మందాకిని... ఒహ్, నాగురించి చదువుకున్నట్లుగా ఉంది. నిజానికి, చాన్నాళ్ళక్రితం ఆఫీసులో ఈ టపా చదివాను. ఇదే విషయం వివరంగా వ్యాఖ్య కూడా రాసింట్లు గుర్తు. మరెందుకు పబ్లిష్ కాలేదో!

సర్లెండి... మళ్ళీ కంటపడింది. మీ శైలి చాల అలవోకగా, ఓపిగ్గా చదివించే విధంగా ఉంది. అభినందనలు.

ఉమాశంకర్ said...

గిరీష్ గారూ,
వ్యాఖ్య రాసారా? ఎలా మిస్సయిందబ్బా... నాకు తెలిసి అప్పటికి నేనింకా కమెంటుమోడరేషను పెట్టుకోలేదు కూడానూ...

అప్పటి మీ మిస్సయిన కమెంటు కి సారీ, ఇప్పటి మీ కమెంటుకి ధెంక్యూ .. రెండూ...:)

అబ్రకదబ్ర said...

>> "ఎలాగైనా రెండో ఇన్నింగ్స్ మొదలేట్టాలి"

శుభం.

అప్పాజోశ్యుల-విష్ణుభొట్ల ఫౌండేషన్ గురించి మీరు వినే ఉంటారు. వినకపోతే - వాళ్ల వెబ్‌సైట్‌లో తెలుగు పుస్తకాలు ఆర్డరిచ్చి తెప్పించుకోవచ్చు. లింక్ ఇస్తున్నాను, చూడండి.

http://www.avkf.org

చిన్ని said...

really i njyd ....nannu nenu choosukunnatlundi . mee old posts anni chavadam modalupettali .

ఉమాశంకర్ said...

చిన్ని గారు,
ధాంక్సండీ.
మీ వ్యాఖ్య పుణ్యమాని ఆ టపాని మరొక్కసారి చదువుకున్నా. మిగతావేమో గాని ఆ టపా మాత్రం ఎన్నిసార్లు చదివినా నాకు విసుగనిపించదు.

Karuna said...

Hello Umar Shankar garu,
Meeru eppudo rasina blog ki ippudu reply istunnanduku emi anukokandi. Eemadyane naku Murali gari Nemalikannu dwara mee blog parichayam aindi. Edaina chadavatame tappa deniki reply ivvatam alavatu leni naku reply iche teerali anipinchela chesindi mee blog. Really, mimmalni abhinandinchakunda, na gatanni gurthuku chesukokunda vundalekapoyanu. Really chala chala baga rasaru meeru. Enta pedda blog rasina kuda enduko peddaga vundi ani anipinchakapovatam mee blog speciality. Mee blogs anni okkokkate chaduvutunnanu nenu. Denni chusina kuda ventane message pettali anipistundi. Naku kuda Novels anna, Eenadu paper anna chala istam. kakapote ma intlo ekkuvaga novels chadavanichevaru kadu, naku enta pichi ante next day exam vundi anna kuda novel dorikindi ante acadamic books lo novel pettukoni intlo vallaki kanapadkunda chadivedanni. andukenemo ippudu naku acadamic knowledge peddaga emi ledu. Annattu meru US lo ekkada vuntaru? Memu kuda US lone vuntunnamu.

ఉమాశంకర్ said...

కరుణ గారు,

Thank you for your comment :) . నేనుండేది కనెక్టికట్లో.నెమలికన్ను ద్వారా నాబ్లాగు మీ దృష్టికిరావటం నాకు ఇంకా ఆనందదాయకం అండీ.

 
అనంతం - by Templates para novo blogger