చిన్నప్పటి స్కూలు, గుర్తుందా అసలు?

Sunday, September 28, 2008

చిన్నప్పుడు చదువుకున్న స్కూలంటే మనలో చాలా మందికి ఎంతో ఇష్టం అనుకుంటాను. అయితే మీ చిన్నప్పుడు చదువుకున్న స్కూలుని మీరు చివరిసారి చూసి ఎన్ని రోజులైందీ? ఆటలు, పాటలు, స్నేహం, చదువు, తగువులూ, కొట్లాటలు, పరీక్షలు , గెలుపు-ఓటమి ఇత్యాదివన్నీ మనకు పరిచయం అయిది అక్కడేగా? నేను మాఊరు వెళ్ళినప్పుడల్లా ప్రతిసారీ అనుకుంటాను చూడాలని. పోయినసారి మాఊరు వెళ్ళినప్పుడు చూసాను. అప్పటికి ఇరవై యేళ్ళు నేను ఆ స్కూలు నుంచి బయటికి వచ్చి. నాకైతే చాలా బాధ వేసింది దాన్ని చూడగానే. నేను చదివేటప్పుడు మావూర్లో అదే ప్రధాన పాఠశాల. ఇంకొక చిన్న స్కూలు, క్రైస్తవ మిషనరీ ద్వారా నడిచే కాన్వెంట్ ఉన్నా కూడా ఈ స్కూలుతో పోలిస్తే అవో లెక్కలోకి రావు. దాదాపు రెండువేల మంది విద్యార్ధులతో కళ కళ లాడుతూ ఉండెది. గత యిరవై ఏళ్ళలో ఎన్నోమార్పులు. విద్య వ్యాపారమై వీధికో స్కూలు వెలిసాయి. తెలుగు భాష, తెలుగు మీడియం మీద ఉన్న చిన్న చూపు నా స్కూలునో చూపు చూసాయి. ఇంకేముంది విధ్యార్ధుల సంఖ్య ఎంత పడిపొయిందంటే దాదాపు స్కూలు మూతపడిపొయేంత. ఒకప్పుడు గర్వంగా చెప్పుకొనే స్కూలు కాస్త ఇప్పుడు అయ్యో ఆ స్కూలా, ఏదైనా మంచి ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళో జేర్పించొచ్చుగా అనేలా మారిపొయింది పరిస్తితి. విధ్యార్ధులు లేక , స్కూలు ముందు భాగంలో, మెయిన్ రోడ్డు నానుకొని ఉన్న తరగతి గదుల్ని పడెసి షాపులు కట్టి అద్దెకిచ్చేసారు. అంతకు ముందు నా ఏడవతరగతి క్లాసులు అక్కడె జరిగేవి. ఈ స్కూలు పరిస్థితే ఇలా ఉంది అంటే, బహుశా నేను ఒకటి నుండి ఐదవ తరగతి వరకు చదివిన స్కూలు ఈపాటికి శిధిలమై ఉండవచ్చు లేదా ఈపాటికి అక్కడొక బ్రహ్మాండమైన భవనం లేచినా లేచి ఉండవచ్చు. ఈసారి వెళ్ళినప్పుడు ఈ రెండు స్కూళ్ళకు వెళ్ళి కొన్ని ఫొటోలు తీసుకోవాలి అవి శాశ్వతం గా అదృశ్యమయ్యేలోపు.
సరే ఇంతకీ నేను చెప్పదలచుకుందేమంటె, ఈసారి మీరు మీ ఊరెళ్ళినప్పుడు మీ బాల్యానికి చిరునామాల్లాంటి మీరు చదివిన స్కూళ్ళని ఒకసారి చూసుకొని రండి. మరలా ఒక్కసారి ఆ జ్ఞాపకాల్ని తలుచుకొని తడిసి ముద్దవ్వండి.ఏమంటారు?

6 comments:

Purnima said...

:-) నేను నిన్నే చూశాను. నిజమే.. స్కూలుని చూస్తే బాల్యం అలా కళ్ళముందుంటుంది. మంచి టపా!

రిషి said...

ఆం.ప్ర.గురుకులం లో చదివాను నేను.
డిగ్రీ, పీజీ రోజుల్ని మరిచిపోయినా...ఆ స్కూలూ.. అక్కడ చదివిన రోజులు..నాకు మంచి జ్ఞాపకాలు. మీ టపా తో మళ్ళీ వాటిని గుర్తు చేసినందుకు థాంక్యూ. :)

kiraN said...

నేను రెండో క్లాసు వరకూ నరసాపురంలోని సన్ షైన్ స్కూల్లో చదువుకున్నా. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ స్కూలుకి వెళ్తాను, మా సర్ తో (ప్రిన్సిపాల్) మాట్లాడతాను.
ఆ తర్వాత పాలకొల్లులోని సూర్య కాన్వెంట్లో పదో క్లాసు వరకూ చదివాను. ఇప్పుడు ఆ స్కూలు లేదు.
మూసేసారు.

-కిరణ్

బొల్లోజు బాబా said...

its good idea.
once i took my children to the class rooms i studied. (ofcourse on sunday). its a great experiece.

bolloju baba

ఉమాశంకర్ said...

@పూర్ణిమ, రిషి, కిరణ్,బాబా గార్లకు: నా బ్లాగుకొచ్చి, టపా చదివి వ్యాఖ్యానించినందులకు ధన్యవాదాలు.

చిన్ని said...

నేను అంతేనండి ఎప్పుడు అవకాశం వచ్చిన వదలను ...లోపలి పోయి నేను కూర్చున్న బెంచిల్లోను కుర్చుంటాను.

 
అనంతం - by Templates para novo blogger